
ఎస్సై కావాలనుకుని.. ప్రేమకాటుకు యువతి బలి
Web desc : ఎస్సై కావాలనే లక్ష్యంతో శిక్షణ పొందుతున్న యువతి ప్రేమకాటుకు బలి అయ్యింది. ప్రేమ విఫలం కావడంతో ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా, యవకుడి కుటుంబ సభ్యులే యువతిని ఉరివేసి చంపారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మునిగె కుమారస్వామి, సుకన్య దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
దంపతులు వ్యవసాయం , కిరాణా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా, పెద్ద కుమార్తె సుస్మిత ( 25 ) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు నిర్వహిస్తున్న ఎస్సై ఉద్యోగ శిక్షణ తీసుకుంటుంది. అదే గ్రామానికి చెందిన అనిల్, సుస్మిత రెండేండ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఆమె పెండ్లి చేసుకోవాలని అతడిని కోరగా వేరే కులం అమ్మాయి అయినందున తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని అనిల్ వాయిదా వేస్తూ వచ్చాడని, ఒకసారి గర్భ స్రావం కూడా చేయించాడని, సుస్మితను అనిల్, అతడి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్సే ఉరివేసి చంపారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఎస్సైగా ఎదగాల్సిన తమ బిడ్డ ఇలా ప్రాణాలు కోల్పోయిందంటూ కన్నీరుమున్నీరయ్యారు. తమ బిడ్డ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు మహబూబాబాద్ అండర్ బ్రిడ్జి వద్ద ఆందోళనకు దిగారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాజు తెలిపారు.