
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా
ప్రతి కుటుంబం ఈ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
నవంబర్ 19 నుంచి పథకం అమలు
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ నవంబర్ 14 2026: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఏన్కూరు మండల ప్రత్యేక అధికారి మొహమ్మద్ ముజాహిద్ కోరారు. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించనున్నట్లు తెలిపారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని నవంబర్ 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి రానున్న నేపథ్యంలో ఏన్కూరు మండలంలోని అన్ని గ్రామాల్లో అర్హులైన కుటుంబాల వివరాలను పకడ్బందీగా సేకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కుల, మత, ఆదాయ భేదాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందని వివరించారు.
ముఖ్యంగా 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన కుటుంబ సంపాదన సభ్యుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. నమోదు సమయంలో ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, నామినీ పేరు, నామినీతో ఉన్న సంబంధం, ఆధార్ వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని స్పష్టం చేశారు.
కుటుంబ పెద్ద తమ కుటుంబానికి చెందిన ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులను నామినీలుగా ప్రతిపాదించుకునే అవకాశం ఉందని, ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలు ఉంటే వారికి కేటాయించే వాటాలను కూడా నమోదు చేయవచ్చని తెలిపారు.
ఈ నెల 18న మండలంలోని అన్ని గ్రామాల్లో టాంటాం ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలకు పథకంపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి కుటుంబం వివరాలు నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ సత్యనారాయణ, మండల పంచాయతీ అధికారి ఖాదర్ మియా, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ లక్ష్యం నెరవేరేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మండల ప్రత్యేక అధికారి సూచించారు. ప్రజలు నమోదు ప్రక్రియలో సరైన వివరాలు అందించి అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.