
దాసరిపల్లి సర్పంచ్‌పై దాడి కలకలం.. ఏడుగురిపై ఆరోపణలు!
సంతకాల ఫోర్జరీ వివాదమే దాడికి కారణమా? పోలీసులకు ఫిర్యాదు చేసిన సర్పంచ్ బోయ వెంకటేష్..
మల్దకల్, నవంబర్ 15:
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం దాసరిపల్లి గ్రామ సర్పంచ్ బోయ వెంకటేష్‌పై దాడి జరిగినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అదే గ్రామానికి చెందిన మహేంద్ర అనే వ్యక్తి మున్సిపాలిటీ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.
సర్పంచ్ బోయ వెంకటేష్‌కు సంబంధించిన సంతకాలను మహేంద్ర ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ఉండగా, ఈ వ్యవహారమే ఇరువురి మధ్య వివాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహేంద్రతో పాటు మరో ఏడుగురు తనపై దాడి చేసినట్లు బాధిత సర్పంచ్ ఆరోపించారు.
శనివారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో బిజ్వారం నుంచి తన స్వగ్రామమైన దాసరిపల్లికి వెళ్తుండగా మార్గమధ్యంలోని దొరబాయి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెంకటేష్ తెలిపారు. దాడిలో గాయపడిన ఆయన ప్రస్తుతం గద్వాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై మల్దకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించంరు.
బాధితుడికి నేతల పరామర్శ… సర్పంచ్ వెంకటేష్‌పై దాడి జరిగిన విషయం తెలుసుకున్న మల్దకల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు, అమరవాయి గ్రామానికి చెందిన తూమ్ కృష్ణారెడ్డి, దాసరిపల్లి మాజీ సర్పంచ్ భరత్ రెడ్డి గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.. ప్రజాప్రతినిధిగా ఉన్న సర్పంచ్‌పైనే దాడి జరగడం ఆందోళనకరమని వారు పేర్కొన్నారు. సంతకాల ఫోర్జరీ ఆరోపణలతో పాటు దాడి ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత సర్పంచ్‌కు న్యాయం జరిగే వరకు పూర్తిస్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు.