
ఉస్మానియా యూనివర్సిటీలో అర్ధరాత్రి విద్యార్థినుల నిరసన
నాణ్యత లేని ఆహారం.. కల్తీ భోజనం పెడుతున్నారంటూ లేడీస్ హాస్టల్ విద్యార్థినుల ఆందోళన
హైదరాబాద్, సి కె న్యూస్ ప్రతినిధి:
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులు రాత్రి వేళ నిరసన బాట పట్టారు. యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో నాణ్యత లేని, కల్తీ ఆహారం అందిస్తున్నారంటూ విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అందిస్తున్న భోజనం నాణ్యతగా ఉండటం లేదని, ఆహారం విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రాత్రి సమయంలో ఆందోళనకు దిగారు.
హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం అందించాల్సిన బాధ్యత యూనివర్సిటీ అధికారులపై ఉందని నిరసనకారులు పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
హాస్టల్లో అందిస్తున్న ఆహార నాణ్యతపై వెంటనే విచారణ చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థినులకు పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థినుల ఆందోళనతో ఉస్మానియా యూనివర్సిటీలో రాత్రి వేళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.