
చర్లపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. తగలబడుతున్న రైలు బోగీలు
హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్లో మెయింటేనెన్స్ కోసం ఆపి ఉన్న ఓ ట్రైన్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చివరి బోగీలో చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోని ఇతర బోగీలకు వ్యాపించాయి.
దీంతో మొత్తం ఏడు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. అయితే ట్రైన్లో మంటలు చెలరేగడాన్ని గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే రైల్వే పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్ సహాయంతో మంటలను అర్పుతున్నారు.
అయితే మంటలు బోగీలకు వ్యాపించకుండా తలగబడిన బోగీల నుంచి మిగతా బోగీలను వేరు చేశారు అధికారులు. ఈ ఘటనపై రైల్వే అధికారులు మాట్లాడుతూ.. సాయంత్రం 06:30 గంటల సమయంలో ప్లాట్‌ఫారమ్ నంబర్ 5, 6 మధ్య ఆపి ఉంచిన ఖాళీ ట్రైన్లో అగ్నిప్రమాదం జరిగినట్టు తెలిపారు.
ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వాళ్లు వచ్చి మంటలను ఆర్పేసినట్టు తెలిపారు. అయితే చివరి బోగీలో మంటలు చెలరేగాయని.. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.