
రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇన్స్పెక్టర్!
Web desc : హైదరాబాద్ నగరంలో అవినీతి పోలీసు అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ACB) కొరడా ఝళిపించింది. గోల్కొండ జోన్ పరిధిలోని టోలిచౌకి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ (CI) ఎల్ రమేష్ నాయక్ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.
అసలేం జరిగిందంటే? టోలిచౌకి పరిధిలోని ఒక హోటల్ మరియు కేఫ్ నిర్వాహకులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ లంచం డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ల కోసం అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత కూడా అదనంగా మరో గంట పాటు కేఫ్ నడుపుకునేందుకు అనుమతించడంతో పాటు ఇతర వెసులుబాట్ల కోసం నెలవారీ మామూలు ఇవ్వాలని పట్టుబట్టారు.
రూ.50 వేల నుంచి రూ.40 వేలకు బేరం : మొదట నెలవారీ మామూలుగా రూ.50 వేలు డిమాండ్ చేసిన సీఐ, ఆ తర్వాత మొదటి నెలకు రూ.10 వేలు రాయితీ ఇచ్చి రూ.40 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత : ఈ ఒప్పందంలో భాగంగా గత నెల 31న మొదటి విడతగా రూ.20 వేలు తీసుకున్న రమేష్ నాయక్, మిగిలిన రూ.20 వేలు తీసుకుంటుండగా బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
సోదాల్లో భారీగా లెక్కల్లో చూపని నగదు స్వాధీనం : ఇన్స్పెక్టర్ను అదుపులోకి తీసుకున్న అనంతరం ఏసీబీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఆయన వద్ద నాలుగు వేర్వేరు కవర్లలో ఉంచిన రూ.1,80,000 లెక్కల్లో చూపని నగదు బయటపడింది. ఆ మొత్తాన్ని అధికారులు సీజ్ చేశారు. అనంతరం నిందితుడు రమేష్ నాయక్‌ను అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.