
‘జబర్దస్త్’ కమెడియన్లకు రోడ్డు ప్రమాదం… ఇద్దరికీ తీవ్ర గాయాలు
ప్రముఖ కామెడీ షో ‘జబర్దస్త్’ కమెడియన్లు రైజింగ్ రాజు, దొరబాబు లకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడా అగ్రహారం వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో కారులో ఉన్న రైజింగ్ రాజు, దొరబాబు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఓ ప్రైవేటు కార్యక్రమం నిమిత్తం కాకినాడ నుంచి భీమవరం వైపు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో పెన్నాడా అగ్రహారం వద్దకు రాగానే కారు ఒక్కసారిగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.
ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. స్థానికులు వెంటనే స్పందించి కారులో ఉన్న వారిని బయటకు తీశారు. గాయపడిన రైజింగ్ రాజు, దొరబాబులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రాణహాని లేదని తెలియడంతో వారి అభిమానులు, తోటి కళాకారులు, కార్యక్రమ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.