
భార్యాభర్తల పంచాయితీలో ఎస్ఐ అత్యుత్సాహం.. యువకుడికి గాయాలు!
Web desc : తల్లాడ: భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్థలను పరిష్కరించాల్సిన పోలీసు అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కౌన్సిలింగ్ కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ యువకుడిపై ఎస్ఐ చేయి చేసుకోవడంతో అతడి చెవికి తీవ్ర గాయమై రక్తస్రావమైన ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కోనిజర్ల మండలం పెద్ద రాంపురం గ్రామానికి చెందిన కుప్పక పవన్ కుమార్‌కు, తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామానికి చెందిన యువతితో వివాహమైంది. ఇటీవల దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో సమస్య పరిష్కారం కోసం ఈ నెల 21న ఇరువురు తల్లాడ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.
ఈ క్రమంలో దంపతులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న తల్లాడ రెండో ఎస్ఐ బానోతు వెంకటేష్ ఒక్కసారిగా సహనం కోల్పోయి పవన్ కుమార్ ఎడమ చెవిపై బలంగా కొట్టినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనలో పవన్ తల పక్కనే ఉన్న గోడకు బలంగా తగిలినట్లు తెలిపారు. అక్కడే ఉన్న అతడి తల్లిదండ్రులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఎస్ఐ వినిపించుకోలేదని వాపోయారు. ఎస్ఐ కొట్టడంతో పవన్ చెవి నుంచి తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం బాధితుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కుటుంబ సమస్యను పరిష్కరించాల్సిన పోలీసులే ఇలా వ్యవహరించడంపై బాధితుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.




