
8వ తరగతి విద్యార్థిని పై టీచర్ పైశాచికం…
Web desc : 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని జుట్టు వేసుకోలేదని కోపంతో ఇంగ్లీష్ సబ్జెక్ట్ బోధించే టీచర్ మంజుల కరెంట్ పైపుతో విచక్షణారహితంగా చితకబాదిన సంఘటన సోమవారం ఉదయం జరిగింది. ఈ విషయం ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు.
రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో ఐదు రోజుల క్రితం రామాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థి వీపంతా వాతలు వచ్చేటట్లు కొట్టిన ప్రధానోపాధ్యాయుడి సంఘటన మరువక ముందే తాజాగా మరో ఘటన పెంట్లవెల్లి మండల కేంద్రంలోని కేజీబీవీలో చోటుచేసుకుంది. సదరు కేజీబీవీలో ఉన్నత పాఠశాల/జూనియర్ కళాశాల కొనసాగుతుంది. ఇందులో సుమారు 300 మంది బాలికలు ఉన్నారని తెలిసింది.
అయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్ బోధించే టీచర్ మంజులపై అనేక అభియోగాలున్నాయి. ఆ టీచర్ అంటేనే.. అందులో చదివే బాలికలు హడలిపోతుంటారట. చదువుల పేరుతో భయభ్రాంతులకు గురిచేయడంతో ఆమె ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారిందని విద్యార్థినులు చెబుతుంటారు. అందులో పనిచేసే ఉపాధ్యాయినులు సైతం సదరు ఇంగ్లీష్ టీచర్‌కు అడ్డు చెప్పని పరిస్థితి ఏర్పడింది.
ఈ సంఘటనకు సంబంధించి బాధిత విద్యార్థిని ప్రమీల కథనం ప్రకారం పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన చొప్పరి రవి, మునీశ్వరీ దంపతుల కుమార్తె ప్రమీల 8వ తరగతి చదువుకుంటున్నది. అయితే సోమవారం ఉదయం విద్యార్థినులందరూ జుట్టు కట్టుకుంటున్నారు.
అయితే తనకు ఓ విద్యార్థిని ఒక జట్టు వేసి రెండో జట్టు వేస్తుండగా టీచర్ మంజుల ఆ గది వైపు వస్తున్న రాకను గమనించి సదరు విద్యార్థిని అక్కడి నుంచి తప్పుకుంది. నీవు ఇంకా జుట్టు వేసుకోలేదా అంటూ కోపంతో టీచర్ మంజుల కరెంట్ పైపుతో విచక్షణారహితంగా చేతులపై చితకబాదింది. తోటి ఉపాధ్యాయినులు ఉండి కూడా ఆమెను నిలువరించలేకపోయారు.
ఈ సంఘటనను కళ్లారా చూస్తున్న విద్యార్థినులు భయంతో వణికిపోయారు. పైపుతో విచక్షణారహితంగా కొట్టిన దెబ్బలకు విద్యార్థిని ప్రమీల చేతులు సాయంత్రం వరకు కదలిక లేకుండా పట్టుకుపోయాయి. సదరు పరిస్థితిని చూసిన కేజీబీవీ ఇన్చార్జి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ పాపకు చేతులు పట్టుకుపోయాయి.
బాగా నొప్పులు పట్టి కదలడం లేదు.. తీసుకెళ్లి ఆసుపత్రిలో చికిత్స చేయించండి అని సమాచారం ఇచ్చింది. దీంతో కూలీ పనులకు వెళ్లిన తల్లిదండ్రులు ఆందోళనకు గురై కేజీబీవీ పాఠశాల నుంచి తీసుకెళ్లి జటప్రోలు గ్రామంలో ప్రథమ చికిత్స చేయించారు. సదరు డాక్టర్ సూచన మేరకు మంగళవారం కొల్లాపూర్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాలిక రెండు చేతులకు ఎక్స్‌రే తీయించగా దెబ్బతిన్నట్లు తెలిసింది.
డాక్టర్ సూచన ప్రకారం విద్యార్థిని ప్రమీలను తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు. తల్లికి ఫోన్ చేసి ప్రాధేయపడిన టీచర్ మంజుల.. ఆసుపత్రిలో విద్యార్థిని ప్రమీలకు చికిత్స చేయించుకొని స్వగ్రామానికి (జటప్రోలు) తల్లిదండ్రులు సోమవారం సాయంత్రం తీసుకొచ్చారు. టీచర్ మంజుల సమాచారం తెలుసుకొని అదే సాయంత్రం 4:20 గంటల సమయంలో తల్లి మునీశ్వరికి ఫోన్ చేసింది.
తాను చాలా మంచిదాన్ని. నా గురించి మీ పాపను అడిగి తెలుసుకో. పాపకు చికిత్స అయిన ఖర్చులు ఇస్తా. ఎవరికీ చెప్పొద్దని ప్రాధేయపడుతూ టీచర్ మంజుల మాట్లాడిన ఆడియో ఓ పత్రిక ప్రతినిధికి చేరింది. టీచర్ మంజుల కేజీబీవీలో విధుల్లో చేరినప్పటి నుంచి వివాదాస్పద వైఖరి.
తనకు పలానా లీడర్లు తెలుసంటూ.. తనను ఎవ్వరూ ఏమి చేయలేరంటూ కేజీబీవీలో బిల్డప్‌లు ఇస్తుందని తెలిసింది. విధులకు కూడా సక్రమంగా రాదని, వచ్చిన రోజు రాని రోజుల హాజరు వేసుకుంటుందని కూడా సమాచారం. ఏదీ ఏమైనా విద్యార్థిని ప్రమీలను చితకబాదిన సంఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారు.