
ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం – పలు డాక్యూమెంట్లు దగ్ధం..!
హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ ప్రాంతంలో ఉన్న జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
మహానగరంలోని ప్రధాన పరిపాలనా కేంద్రాలలో ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం ఒకటి. నిత్యం వేలాది మంది ప్రజలు, అధికారులు, సిబ్బంది రాకపోకలతో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. కార్యాలయంలో మంటలు చెలరేగడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సిబ్బంది, సందర్శకులు అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి మూడు ఫైరింజన్ల సహాయంతో మంటలు ఇతర భాగాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. మంటలు ఎందుకు చెలరేగాయి, ఆస్తి నష్టం ఎంత జరిగింది అనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కీలక డాక్యూమెంట్లు దగ్ధం..!
ఈ ప్రమాదంలో భాగంగా రెండో అంతస్తులోని చెక్ సెక్షన్లో భారీగా మంటల చెలరేగడంతో పలు కీలకమైన డాక్యూమెంట్లు దగ్ధం అయినట్లు సమాచారం. షార్ట్ సర్కూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందా..? లేదా ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనేది పూర్తిస్థాయి విచారణలో తేలనుంది. రికార్డుల దగ్ధంపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.