
ఈచదువు నాతోని అయితలే.. sorry మమ్మీ..
వరంగల్ : ‘ఈ చదువు నాకు అర్థం ఐతలే. ఎంత కష్టపడ్డా రావట్లేదు. మీకు చెప్తే మీరు అర్థం చేస్కుంటలేరు. నాకు టెన్షన్ ఐతాంది. మైండ్ వోతాంది. నేను చదువుకుందాం అనుకున్న గ్రూపు మీరు ఒప్పుకోలె.
మీకిష్టమైన గ్రూపు నాతోని ఐతలే. ఏం అర్థం కాక మధ్యలో నలిగిపోతున్న. ఇంత తక్కువ మార్కులు వస్తుంటే మీరు తట్టుకోలేరు. అందుకే చనిపోతున్నా’ అంటూ ఇంటర్ విద్యార్థి ఉసురు తీసుకుంది.
ఆ తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చింది. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన మిట్టపల్లి కుమార్, కవిత దంపతులు పెద్ద కుమార్తె శివాని. ఈఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేర్పించారు. మరో మూడు రోజులైతే ఆమె పుట్టిన రోజు రాబోతోంది. ఇంతలోనే ఈ ఘటన జరగడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
హనుమకొండ జిల్లా నయీంనగర్‌లోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మిట్టపల్లి శివాని(17) ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారుజామున నాలుగు గంటలకు స్నానానికి వెళ్లిన ఆమె ఎంతసేపయినా కనిపించకపోవడంతో.. ఆమె స్నేహితురాలు కళాశాల సిబ్బందికి విషయం తెలిపింది. అనంతరం శివానిని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు.
వైద్య పరీక్షల అనంతరం అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న శివాని తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాలు శివాని మృతికి యాజమాన్యమే కారణమని కళాశాల ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
తండ్రి మిట్టపల్లి కుమార్ మాట్లాడుతూ.. తెల్లవారుజామున నాలుగు గంటలకు ఘటన జరిగితే తనకు 8:50 గంటలకు కాల్ చేశారని.. తమ అనుమతి లేకుండా శివానిని ఆస్పత్రికి తరలించారన్నారు.
తన కూతురుకు తెలుగు రాకపోయినా తెలు గులో సూసైడ్ నోట్ ఎలా రాస్తుందని ప్రశ్నించారు. కళా శాల సిబ్బంది వేధింపులతోనే తమ కూతురు ఆత్మహత్య కు పాల్పడిందని, సూసైడ్‌నోట్ కూడా కళాశాల యాజమాన్యం సృష్టించిందని ఆరోపించారు.
హనుమకొండ సీఐ మచ్చ శివకుమార్, ఎస్సై కిశోర్‌కుమార్ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. శివాని తండ్రి మిట్టపల్లి కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హనుకొండ ఇన్‌స్పెక్టర్ ఎం.శివకుమార్ తెలిపారు.
కంటతడి పెట్టించిన సూసైడ్ నోట్
‘మమ్మీ.. చెల్లిని బాగా చదివించండి. మంచి కాలేజీలో మంచి గ్రూప్ తీసుకోమను. నాలాగా అర్థం కాని చదువు వద్దు. దాన్ని మంచిగా చదివించి మీరు మంచిగా ఉండండి. కాలేజీలో జాయిన్ చేసే ముందు ఎవరినైనా కొంచెం అడిగి జాయిన్ చేయండి.
చెల్లి నువ్వు కూడా మంచిగా చదువుకోవే.. ఆ చదువు నాకు అర్థం ఐతలే. మీకు చెప్తే మీరు అర్థం చేస్కుంటలేరు. నాకు మొత్తం టెన్షన్ ఐతాంది. మైండ్ వోతాంది. మీరు చెప్పిన చదువు నాతోని ఐతలే. నేను చదువుదాం అనుకున్న చదువుకు మీరు ఒప్పుకోలే. చివరికి నాకు చావే దిక్కు అయ్యింది.
ఏం అర్థం కాక మధ్యలో నలిగిపోతున్న. ఈసంవత్సరం అంటే మీరు ఫీజు కట్టారని ఏదోలా కింద మీద పడి ఉన్న. ఇగ నాతోని కాదు. నేను వెళ్లిపోతున్న నాకు ఇంత తక్కువ మార్కులు రావడం నేను, మీరు తట్టుకోలేరు. అందుకే చనిపోతున్నా.
అందరూ జాగ్రత్త. మంచిగా ఉండండి. ఈఒక్క సంవత్సరం కూడా మీకోసమే చదివిన. అయినా నాతోని అయితలే. ఎంత కష్టపడ్డా రావడం లేదు. అందరూ జాగ్రత్త’ అని శివాని రాసిన సూసైడ్ నోట్ చదివిన వారందరూ కంటతడి పెట్టుకున్నారు.