
లైసెన్స్ కేబుళ్లు తప్ప మరే కేబుళ్లు ఉంచొద్దు : హై కోర్టు
లైసెన్స్ కలిగి ఉన్న కేబుళ్లు తప్ప విద్యుత్ స్థంబాలకు మరే కేబుళ్లు ఉంచవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీలో కేబుళ్ల తొలగింపు పై ఎయిర్ టెల్ పిటిషన్ పై ఇవాళ జస్టీస్ నగేశ్ భీమపాక మరోసారి విచారణ జరిపారు.
రామంతాపూర్ ఘటన తర్వాత హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో కేబుల్ వైర్లను విద్యుత్ అధికారులు కట్ చేశారు. వైర్లకు తిరిగి కనెక్షన్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఎయిర్‌టెల్ సంస్థ కోరింది.
అయితే, ఎయిర్‌టెల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. లైసెన్సు తీసుకున్న కేబుల్స్ తప్ప ఏవీ ఉంచవద్దని జస్టిస్ నగేష్ బీమాపాక ఆదేశాలు జారీ చేశారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటంపై జస్టిస్ నాగేష్ బీమాపాక సీరియస్ అయ్యారు. రామంతాపూర్‌లో ఐదుగురు మరణించిన ఘటనను ఈ సందర్భంగా జడ్జి ప్రస్తావించారు. పుట్టిన రోజు నాడే తండ్రికి తలకొరివి పెట్టిన బాలుడు ఘటనపై జడ్జి ఉద్వేగ భరిత వ్యాఖ్యలు చేశారు.
కేకు కోయాల్సిన తొమ్మిదేళ్ల బాలుడు తలకొరివి పెట్టడం తనను తీవ్రంగా కలచి వేసిందని జస్టిస్ నగేష్ భావోద్వేగానికి గురయ్యారు.విద్యుత్ ప్రమాదంపై ఎవరికి వారు చేతులు దులుపుకుంటే ఎలా అని ప్రశ్నించారు.
ప్రజల ప్రాణాలకు బాధ్యులు ఎవరని జస్టిస్ నగేష్ బీమాపాక ప్రశ్నించారు. ఈ ఘటనతో ప్రతి హృదయం పగిలిపోయిందని.. అందరం బాధ్యులమేనని జస్టిస్ నగేష్ పేర్కొన్నారు.
ఈ విషయంలో సమాజం సిగ్గుతో తలదించుకోవాలని జస్టిస్ బీమాపాక నగేష్ చెప్పుకొచ్చారు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.