
ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా…
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ తనపై సస్పెన్షన్ వేటు వేయడంపై కవిత తీవ్రంగా స్పందించారు.
ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా కవిత ప్రకటించారు. ఇందుకు సంబంధించి రెండు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అలాగే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా లేఖ రాశారు.
బీఆర్ఎస్ పార్టీ తనపై సస్పెన్షన్ వేటు వేయడంపై కూడా కవిత స్పందించారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంత విరామం తీసుకుని, 2024 నవంబర్ నుంచి ప్రజా సమస్యలపై పోరాడానని, పార్టీ శ్రేణులను కూడా కలుపుకుని ముందుకు వెళ్లానని చెప్పారు.
ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. తాను అధికార కాంగ్రెస్‌పై పోరాడితే… బీఆర్ఎస్లోని కొందరు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉన్నానంటే అందులో తప్పేముందని ప్రశ్నించారు.
సామాజిక తెలంగాణ నినాదానికి బీఆర్ఎస్ వ్యతిరేకమా? అని ప్రశ్నించారు. తన తండ్రి కేసీఆర్ బంగారు తెలంగాణ నినాదంతో ముందుకు సాగారని… అయితే హరీష్ రావు ఇంట్లో, సంతోష్ కుమార్ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అయిపోతుందా? అని ప్రశ్నించారు.
తన మీద కుట్రలు జరుగుతున్నాయని పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడితే… పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకు ఫోన్ చేసి మాట్లాడారా? అని ప్రశ్నించారు. కుటుంబం విషయంల పక్కన పెడితే… పార్టీలో ఒక ఎమ్మెల్సీ సమస్య గురించి చెబితే పట్టించుకోరా? అని అడిగారు.
ఇప్పటికే తాను ఆ మాటలు మాట్లాడి 103 రోజులు అయిపోయిందని తెలిపారు. కేసీఆర్ వద్ద నుంచి కమ్యూనికేషన్ రావాలని తాను ఆశించలేదని, వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ఫోన్ రాకపోవడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు.
కేసీఆర్, కేటీఆర్, తనది రక్త సంబంధం అని… పదవులు పోతేనో, పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తేనో పోయే బంధం కాదని అన్నారు. అయితే పార్టీలో ఉండి డబ్బు సంపాదించుకోవాలని, వ్యక్తిగత లబ్ది పొందాలని చూస్తున్నవారు…
తమ కుటుంబం బాగుండకూడదని, తాము ముగ్గురం కలిసి ఉండొద్దని, తమ కుటుంబం విచ్ఛిన్నం కావాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అందులో మొదటి స్టెప్‌గా పార్టీలో నుంచి తనను బయటకు పంపించారని చెప్పుకొచ్చారు. ఇది ఇక్కడితో ఆగిపోదని… కేసీఆర్ ఆయన చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోవాలని అభ్యర్థిస్తున్నానని పేర్కొన్నారు.
రేపటిరోజున ఇదే ప్రమాదం రామన్న (కేటీఆర్)కు, తన తండ్రి కేసీఆర్‌కు పొంచి ఉందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీని వారు హస్తగతం చేసుకునేందుకు చూస్తున్నారని హరీష్ రావు, సంతోష్ కుమార్ టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావులు కలిసి ఒకే ఫ్లైట్‌లో ప్రయాణం చేసిన సమయంలో… రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకుని హరీష్ రావు సరెండర్ అయిన తర్వాత తనపై కుట్రలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు.
అప్పటినుంచే తమ కుటుంబాన్ని విడిగొట్టాలనే ప్రయత్నాలు మొదలయ్యాయని అన్నారు. రేవంత్ రెడ్డి, హరీష్ రావులు ఒకే ఫ్లైట్‌లో ప్రయాణించారా? లేదా? అనేది వారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
హరీష్ రావుకు చెందిన డెయిరీలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రచారం తెరమీదకు తీసుకువస్తారని, కానీ చర్యలు తీసుకోరని కవిత ఆరోపించారు. పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి పీఆర్వో ట్వీట్ చేస్తారు…
తర్వాత పేపర్లలో వార్తలు వస్తాయి… కానీ మూడు రోజులకు ఆ విషయం మాయం అయిపోతుంది… అదే కేటీఆర్‌ను అయితే విచారణ పేరుతో పిలిచి వేధింపులకు గురిచేస్తారు. రేవంత్ రెడ్డితో నిఖార్సుగా కొట్లాడుతున్నాం కాబట్టే మా మీద కేసులు పెడతారు…
వాళ్లది (హరీష్ రావు) మాత్రం మూడు రోజులకే గయబ్ అయిపోతుంది” అని కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటివి ఎన్నో ఆరోపణలు వచ్చాయి… కానీ అవన్నీ మాయమైపోయాయని… హరీష్ రావు మీద ఎలాంటి కేసులు, విచారణలు లేవని విమర్శించారు.




