
అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడి మృతి…
అమెరికాలో పోలీసుల కాల్పుల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన యువకుడు మృతి చెందాడు. ఘటన జరిగిన 2 వారాల తర్వాత ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది.
మహబూబ్‌నగర్ పట్టణంలోని బీకే రెడ్డి కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు హసానుద్దీన్, ఫర్జానాబేగం దంపతుల కుమారుడు మహ్మద్ నిజాముద్దీన్ (29) ఈ నెల 3న అమెరికాలోని కాలిఫోర్నియా శాంటాక్లారా ఏరియాలో తనతోపాటు గదిలో అద్దెకు ఉంటున్న రూమ్మేట్‌తో ఏసీ విషయంలో గొడవపడ్డాడు.
ఆవేశంలో కూరగాయలు కోసే కత్తితో అతడిని పొడిచాడు. వారి గది నుంచి శబ్దాలు రావటాన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అక్కడికి చేరుకున్న పోలీసులు.. లొంగిపోవాలని హెచ్చరించినా నిజాముద్దీన్ వినకపోటంతో 4 రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పుల్లో నిజాముద్దీన్ అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన అతడి రూమ్మేట్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
గురువారం ఉదయం కర్ణాటకకు చెందిన ఒక విద్యార్థి నిజాముద్దీన్ తండ్రి హసానుద్దీన్‌కు ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
నిజాముద్దీన్ 2016లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లి, పదేళ్లుగా అక్కడే ఉంటున్నాడు. ఇటీవల తల్లిదండ్రులతో మాట్లాడిన అతడు.. త్వరలో ఇండియాకు వస్తానని చెప్పాడు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.
మాకు న్యాయం చేయాలి. నా కొడుకు 2016లో అమెరికా వెళ్లాడు. ఫ్లోరిడాలో రెండేళ్లు చదువుకున్న తర్వాత ఏడాదిపాటు వెదకగా జాబ్ వచ్చింది. నాలుగేళ్లు పని చేసిన తర్వాత 2023లో ప్రమోషన్‌తో కాలిఫోర్నియాకు వచ్చాడు.
వీసా గడువు ముగియడంతో పొడిగిస్తామని చెప్పిన కంపెనీవాళ్లు ఆపని చేయలేదు. ప్రభుత్వ అనుమతితో ఆరు నెలలుగా అక్కడే ఉంటున్నాడు.అయితే, రూమ్మేట్ తరుచుగా ఏసీ బంద్ చేస్తుండటంతో గొడవ జరిగిందని చెబుతున్నారు.
మా బాబు స్నేహితుడు రాయచూర్‌కు చెందిన సయ్యద్ మొయినుద్దీన్ గురువారం ఉదయం ఫోన్ చేసి విషయం చెప్పిండు. అంతవరకు మాకు సమాచారం లేదు. ఏం జరిగిందో తెలియాలి. న్యాయం చేయాలి. దీనిపై విదేశాంగమంత్రికి ఫిర్యాదు చేస్తాం.