PoliticalTelangana

మామూళ్ల' మత్తులో డీఈవోలు.. అనుమతుల్లేని స్కూళ్లతో బేరసారాలు.!

మామూళ్ల' మత్తులో డీఈవోలు.. అనుమతుల్లేని స్కూళ్లతో బేరసారాలు.!

మామూళ్ల’ మత్తులో డీఈవోలు.. అనుమతుల్లేని స్కూళ్లతో బేరసారాలు.!

తెలంగాణ : రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలల వ్యవహారంలో జిల్లా విద్యాశాఖాధికారుల (DEO) తీరు వివాదాస్పదంగా మారుతోంది.

అనుమతులు లేని స్కూళ్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీలు చేయాల్సింది పోయి, కార్యాలయాలకే పరిమితమై బినామీల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా కార్పొరేట్ స్కూళ్లు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి పరిధిలో ఉన్నాయి.

గ్రేటర్ జిల్లాల్లో ప్రత్యేకించి ఓఆర్ఆర్ పరిసరాల్లో కొత్త స్కూళ్ల అనుమతుల దందా అధికారులకు అందినకాడికి దోచుకో అన్న చందంగా మారిందని, ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ అధికారి కీలకమైన డీఈవో పోస్టులో పాగా వేశారని, ఆయన్ను విద్యాశాఖ అధికారులు బదిలీ చేయలేకపోతున్నారని విద్యాశాఖలో జోరుగా ప్రచారం సాగుతోంది.

పలుకుబడితో ఒకేచోట తిష్ట..!

రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో డీఈవోలు తమ కార్యాలయాల నుంచి బయటకు రాకుండానే క్షేత్రస్థాయి వ్యవహారాలను నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.

తమకు నమ్మకస్తులైన కొందరు వ్యక్తులను బినామీలుగా పెట్టుకుని, నిబంధనలు పాటించని పాఠశాలల యాజమాన్యాల నుంచి భారీగా వసూలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. విద్యాశాఖ నిబంధనల ప్రకారం కనీస వసతులు లేని స్కూళ్లను మూసివేయించాల్సిందిపోయి, నోటీసుల పేరుతో బేరసారాలు సాగిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

సాధారణంగా రెండేళ్లకోసారి బదిలీలు జరగాల్సి ఉన్నా, పలువురు అధికారులు రాజకీయ పలుకుబడితో అదే స్థానంలో కొనసాగుతున్నారు. ఉన్నతాధికారులు కూడా వీరిపై చర్యలు తీసుకోకుండా మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఏకంగా రూ.4 నుంచి రూ.8 లక్షల వరకు..!

ఇటీవల గ్రేటర్ పరిధిలోని ఒక డీఈవో అవినీతిపై బీసీ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. సదరు అధికారి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆధారాలతో సహా ఏసీబీకి ఫిర్యాదు చేశారు. నిబంధనల అతిక్రమణను ప్రశ్నించాల్సిన అధికారే అక్రమ సంపాదనకు తెరలేపడంపై విద్యా వర్గాల్లో చర్చ నడుస్తోంది.

కొన్ని స్కూళ్లలో ఫైర్ ఎన్వోసీ లేకుండా బోగస్ పత్రాలు జోడించి అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పాత సర్టిఫికెట్లు, లేదంటే ఒకే దాన్ని మూడు, నాలుగు స్కూళ్లకు వినియోగించి అనుమతులిచ్చేస్తున్నారని, ఇలాంటి వాటికి రూ.4 లక్షల నుంచి 8 లక్షల వరకు వసూలు చేస్తున్నారన్న చర్చ సాగుతోంది.

టీచర్లపై సస్పెన్షన్ ఎత్తివేతలు, క్రమశిక్షణ చర్యలు, లాంగ్ లీవ్‌లో ఉన్నవాళ్లు, అనాథరైజ్డ్ సెలవుల్లో ఉన్నవారు తిరిగి విధుల్లో చేరేందుకు రూ. లక్షపైనే వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి: నాగరాజు, ఎస్ఎఫ్ఐ స్టేట్ సెక్రటరీ

ఏళ్ల తరబడి ఒకేచోట తిష్టవేసిన అధికారుల వల్లే ఈ అక్రమాలు జరుగుతున్నాయి. అనుమతులు లేని పాఠశాలలపై వెంటనే విచారణ జరిపించాలి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రంగారెడ్డి డీఈవోను తక్షణమే బదిలీ చేయాలి. బినామీల ద్వారా సాగుతున్న వసూళ్ల పర్వంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button