
ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో మరో ట్విస్ట్!
తెలంగాణలో పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఆరుగురు ఎమ్మెల్యేలు సంజయ్, పోచారం, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డికి స్పీకర్ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. పార్టీ మార్పునకు సంబంధించి మరిన్ని వివరాలు కావాలని కోరారు.
నోటీసులు అందుకున్నవారిలో బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు.
కాగా, ఈ ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో పంపిన నోటీసులకు ఇప్పటికే సమాధానాలు ఇచ్చారు. అయితే వాటికి బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద, చింతా ప్రభాకర్ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ ఉపేందర్‌రెడ్డికి గత సోమవారం రీజాయిండర్లు అందజేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్న పది మంది ఎమ్మెల్యేలు ఎన్నిచేసినా తప్పించుకోలేరని, ప్రజల దృష్టిలో వారంతా దొరికిపోయిన దొంగలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి మూటలతో దొరికి తప్పించుకున్నరు.. మేము తప్పించుకోలేమా? అని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనుకుంటున్నరు.
ఇకడ తప్పించుకున్నా కోర్టు ముందు వీరు తప్పించుకోలేరు. వీరి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం. వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా ప్రజలు తీర్పు చెప్పడం ఖాయమని హెచ్చరించారు.