
రాజకీయాలకు దూరంగా జగ్గారెడ్డి సంచలన నిర్ణయం…
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి ప్రజలకు ముఖ్యమైన రాజకీయ సంకేతం ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన స్థానంలో తన భార్య నిర్మల బరిలోకి దిగుతారని ప్రకటించారు.
సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తన భార్య నిర్మల అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. జగ్గారెడ్డి నిర్ణయం వెనుక కారణాలేంటి? ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన మద్దతుదారుల్లో ఒకటే చర్చ.
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం
దేశంలో రాజకీయాల ట్రెండ్ మారింది. పాత తరం నేతలను పార్టీలు పక్కన బెడుతున్నాయి. కొత్తవారికి అవకాశం ఇస్తున్నాయి. ఏ పార్టీ చూసినా అందరూ మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి.
రాబోయే పరిణామాలను ముందుగానే గమనించారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయలేదని తేల్చిచెప్పారు. దసరా రోజు గురువారం రాత్రి సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి నా భార్య నిర్మల పోటీ చేస్తుందని తేల్చి చెప్పేశారు.
వచ్చే ఎన్నికలకు దూరమన్న జగ్గారెడ్డి : మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గం కోసం ఏం చేయాలో అంతా చేశానంటూ ప్రజలకు వివరించారు.
అయితే ఆయన శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా కాలేదు. కేవలం పదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయనన్నది ఆయన వెర్షన్. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
తన వయస్సు ప్రస్తుతం 59 ఏళ్లని వివరించారు. మరో పదేళ్ల తర్వాత వస్తానన్నారు. అప్పటికి ఆయన వయస్సు దాదాపు 70 ఏళ్లు రావచ్చని అంటున్నారు. ఈలోగా మధ్యలో ఎవరొస్తారో తెలీదన్నారు. కష్టకాలంలో పని చేసినవారికి అవకాశం ఇవ్వాలన్నారు.
ప్రస్తుతం జగ్గారెడ్డి భార్య నిర్మల టీజీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో జగ్గారెడ్డి తరపున నియోజకవర్గంలో వ్యవహారాలను కూతురు జయారెడ్డి చూసేవారు.
గత ఆగష్టులో ఆమెకి వివాహం అయ్యింది. అప్పటి నుంచి నియోజకవర్గం వ్యవహారాలను ఆయన భార్య నిర్మల చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మనసులోని మాట జగ్గారెడ్డి బయటపెట్టారని అంటున్నారు.
మరి ఆయన నిర్ణయంపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి? వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం ఉందని టాపిక్‌ని డైవర్ట్ చేస్తారేమో చూడాలి. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో జగ్గారెడ్డి శకం ముగిసిందని చెప్పవచ్చు.




