
చదువుంటే వెలుగు…లేకుంటే చీకటి
– బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ భారత రాణి
సీకే న్యూస్ జనవరి 24 2026:
జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని గొల్లపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (AID) సంస్థ ఆధ్వర్యంలో బాలిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ భారత రాణి మాట్లాడుతూ, బాలిక సాధికారతకు విద్యే మూలమని అన్నారు. ప్రతి బాలికకు సమాన హక్కులు, నాణ్యమైన విద్య, భద్రమైన భవిష్యత్తు కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
బాలికలు చదవలేరు అనే భావనను సమాజం నుంచి తొలగించాలని, చదువు బాలికలకు ధైర్యం, బలం, ఆత్మవిశ్వాసం ఇస్తుందని పేర్కొన్నారు.
AID సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కే. శ్రీనివాస్ మాట్లాడుతూ, పిల్లలు సెల్ఫోన్ వినియోగాన్ని తగ్గించి పుస్తక పఠనానికి అలవాటు పడాలని సూచించారు.
సెల్ఫోన్ వల్ల బాలికలు అనేక రకాల వేధింపులకు గురవుతున్నారని హెచ్చరించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించి, 2030 నాటికి బాల్య వివాహాలు లేని సమాజం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బాలల సమస్యల పరిష్కారానికి చైల్డ్ లైన్ 1098కు సమాచారం ఇవ్వాలని కోరారు.కార్యక్రమం అనంతరం బాలికలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



