
బీజేపీని ఓడించేందుకు ఎంఐఎంతో కాంగ్రెస్ 100 కోట్ల డీల్: బండి సంజయ్
కరీంనగర్ కార్పొరేషన్‌లో మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు రూ.100 కోట్ల డీల్ కుదుర్చుకున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు.
ఇక్కడ బీజేపీ గెలుపు తథ్యమని తెలిసి, ఆ పార్టీలు తెరవెనుక కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్, చొప్పదండి, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లలో ఆదివారం నిర్వహించిన సభల్లో ఆయన పాల్గొన్నారు.
కరీంనగర్ సభలో బండి మాట్లాడుతూ.. ఇండియా పేరుతో బీజేపీ, పాకిస్థాన్ పేరుతో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కరీంనగర్‌లో కబడ్డీ ఆట మొదలుపెట్టాయని అన్నారు.
ఇక్కడ బీజేపీ 50 సీట్లు గెలవటం ఖాయమని తెలిసి.. కాంగ్రెస్, ఎంఐఎం మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపు ఖాయమని అన్నారు.
రామాయణం, మహాభారతంలో రావణుడు, కౌరవులకు ఏ గతి పట్టిందో ఎంఐఎంకు కూడా అదే గతి పట్టించేదాకా విశ్రమించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ‘బండి సంజయ్ నన్నే ఎక్కువ ఇష్టపడతారని ఒవైసీ మాట్లాడుతున్నాడు.
అరే ఒవైసీ… నీకు తెలుసా? బీజేపీ నేతలకు కుటుంబం కంటే దేశం, ధర్మమే ముఖ్యం.. దుష్ట శిక్షణ కోసం కొన్నిసార్లు ఇంటిని కూడా మర్చిపోతం.
రామాయణంలో రాముడికి ఎప్పుడూ రావణుడే గుర్తొచ్చాడు కదా.. మహాభారతంలో పాండవులకు కౌరవులే గుర్తొచ్చారు కదా..! ఈ బండి సంజయ్‌కి కూడా ఒవైసీనే గుర్తుకొస్తున్నాడు.
రామాయణం, మహాభారతంలో రావణుడు, కౌరవులకు ఏ గతి పట్టిందో ఎంఐఎంకు కూడా అదే గతి పట్టించేదాకా విశ్రమించే ప్రసక్తే లేదు’ అని హెచ్చరించారు. మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కరీంనగర్‌కు రక్షణ కవచంగా ఉంటానని హామీ ఇచ్చారు. జెండాలను పక్కన పెట్టి బీజేపీని గెలిపించాలని కోరారు.
నావల్లే కేసీఆర్‌కు బీపీ, షుగర్ : బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు తనవల్లే బీపీ, షుగర్ వచ్చాయని బండి సంజయ్ తెలిపారు. తాను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిత్యం ప్రజల కోసం పోరాటాలు చేస్తూ..కేసీఆర్‌కు నిద్ర పట్టనీయలేదని తెలిపారు.
పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఉన్నదంతా దోచుకొని ఫాంహౌజ్‌లో పడుకున్నారని, అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఖజానాలో ఒక్క పైసా లేదంటూ ఒక్క హామీని కూడా అమలుచేయటం లేదని ధ్వజమెత్తారు.
ఈ సభల్లో బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి ఆశీష్ షెల్లార్, మాజీ ఎంపీ, సినీ నటి నవనతీ కౌర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, బీజేపీ ఇన్‌చార్జి సంగప్ప, కూరపాటి విజయ్, ఖమ్మం వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.



