
ప్రకాష్ రాజ్ ట్వీట్ పై హేమ స్ట్రాంగ్ కౌంటర్, వైరల్ అవుతున్న వీడియో!
నటుడు ప్రకాష్ రాజ్ చేసిన తాజా సోషల్ మీడియా వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తెలంగాణలో కూడా జనసేన పార్టీని విస్తరించి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ చేసిన పరోక్ష వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
గురువారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ప్రకాష్ రాజ్, “రండి దొర.. మీరొస్తానంటే మేమొద్దంటామా? కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేక సింగిల్‌గా వస్తున్నారా? అది చెప్పి రండి” అంటూ సెటైరికల్ పోస్ట్ చేశారు. ఆయన తన ట్వీట్లో పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ పేర్లను ప్రస్తావించకపోయినా, ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు పవన్‌ను ఉద్దేశించేవేనని పలువురు భావిస్తున్నారు. ఈ ట్వీట్‌పై స్పందించిన నటి హేమ, ప్రకాష్ రాజ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాజకీయ విధానాలు, ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించడం ప్రజాస్వామ్యంలో సహజమని, అయితే వ్యక్తిగత స్థాయిలో దూషించడం సరైన పద్ధతి కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను “దొర” అని సంబోధించడం వెనుక ఉన్న వ్యంగ్యాన్ని తప్పుబట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో హేమ మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా విమర్శించండి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించండి. కానీ వ్యక్తిత్వ హననానికి దిగకండి. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి కోట్లాది మందికి తెలుసు. గతంలో ఇలాంటి విమర్శలు చేసిన వారు ఏమయ్యారో చరిత్రలో చూసుకోండి” అంటూ ప్రకాష్ రాజ్‌కు హెచ్చరికలు జారీ చేశారు. హేమ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఆమెకు మద్దతుగా పోస్టులు పెడుతుండగా, మరోవైపు ప్రకాష్ రాజ్ అభిమానులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ఈ అంశం సోషల్ మీడియా వేదికల్లో విస్తృత చర్చకు కారణమైంది. ఇదిలా ఉండగా, నిర్మాత బండ్ల గణేష్ కూడా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై గతంలోనే తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రతి అంశంలో జోక్యం చేసుకుని తీర్పులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ముందు తన విషయాలు చూసుకోవాలని ప్రకాష్ రాజ్‌కు సూచించారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ చేసిన ఘాటు వ్యాఖ్యలు కూడా అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ట్వీట్, దానికి హేమ ఇచ్చిన కౌంటర్, అలాగే బండ్ల గణేష్ స్పందన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి




