
ఖాళీ షాపులకు ఊపిరి పోసే ప్రయత్నం
ఏన్కూరు మార్కెట్ కాంప్లెక్స్ అద్దె రేట్లు తగ్గింపుపై పరిశీలన
ఏన్కూరు మార్కెట్‌కు డీఎంఓ సందర్శన – వ్యాపారుల సమస్యలపై చర్చ
సీకే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఫిబ్రవరి 11 2026: గతంలో మార్కెట్ కాంప్లెక్స్‌లో అద్దె రేట్లు రూ.5,126గా ఉండగా, ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వ్యాపారస్తులకు ఆ రేట్లు అధికంగా ఉండటంతో షాపులను తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో సమస్య నెలకొంది. ఈ నేపథ్యంలో ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ లచ్చి రామ్ నాయక్ అద్దె రేట్లు తగ్గించాలని డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ (డీఎంఓ)కు లేఖ రాసిన విషయం తెలిసిందే.
ఈ మేరకు డీఎంఓ అలీమ్ బుధవారం ఏన్కూరు వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించి ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న మార్కెట్ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. కాంప్లెక్స్‌లోని దుకాణాల పరిస్థితి, ఖాళీగా ఉన్న షాపులు, వ్యాపార కార్యకలాపాల స్థితిగతులను పరిశీలిస్తూ అధికారులతో వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డీఎంఓ అలీమ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రూ.5,126 అద్దె రేటు వ్యాపారస్తులకు భారంగా మారిందని తెలిపారు. వ్యాపారులకు అనుకూలంగా ఉండేలా అద్దెను రూ.3,000 నుండి రూ.3,500 వరకు తగ్గించే విషయాన్ని వరంగల్ జాయింట్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకునేలా లేఖ పంపిస్తానని చెప్పారు. రేట్లు తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం మార్కెట్లోని రికార్డులను పరిశీలించిన డీఎంఓ, వ్యాపారస్తులతో మాట్లాడి తమ సమస్యలను వివరించాలని సూచించారు. అలాగే మార్కెట్లో పారదర్శకంగా వ్యాపారాలు కొనసాగించేందుకు తక్ పట్టీలు (లావాదేవీ రికార్డులు) తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు.
మార్కెట్ కాంప్లెక్స్ అద్దె రేట్లు తగ్గితే స్థానికంగా మరిన్ని వ్యాపారాలు ప్రారంభమవడంతో పాటు మార్కెట్ కార్యకలాపాలు చురుకుగా మారే అవకాశముందని వ్యాపారస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు,సిబ్బంది పాల్గొన్నారు.



