PoliticalTelangana
Trending

కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

వారంతా మంత్రి పదవికి అర్హులే… కానీ.. కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి అయినా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విస్తరించలేదు. అయితే అప్పుడు, ఇప్పుడు అంటూ వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి అనేక చర్చలు జరుగుతున్నాయి.
కేబినెట్‌లో రెండు ఖాళీలు ఉండగా.. వాటి కోసం అనేక మంది ఎమ్మెల్యేలు లాబీయింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న మంత్రుల్లో నుంచి పలువురిని తప్పించి.. ఖాళీలతో పాటు కొత్త వారితో భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఉన్న మంత్రుల్లో గుబులు రేగుతోంది. అదే సమయంలో మంత్రి పదవి కోసం ఆశపడుతున్న ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది.

ఈ క్రమంలోనే తాజాగా ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మీడియాతో చిట్‌చాట్‌లో కేబినెట్ విస్తరణ గురించి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో తాను భేటీ అయిన విషయాన్ని వెల్లడించిన రేవంత్ రెడ్డి.. మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి ఎలాంటి చర్చలు జరపలేదని తేల్చి చెప్పారు. ఇక కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు ఎవరైనా సరే పార్టీ అధిష్ఠానాన్ని కలుసుకునేందుకు వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో గెలిచిన మొత్తం 66 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవి చేపట్టేందుకు అర్హులేనని రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కానీ రాజ్యాంగ నిబంధనల ప్రకారం మంత్రివర్గంలో కేవలం 17 మందికే అవకాశం ఉంటుందని గుర్తుచేశారు. ఇందుకోసం అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు.. పార్టీలో సీనియారిటీ.. పార్టీ పట్ల నిబద్ధత వంటి అనేక కారణాలను లోతుగా పరిశీలించి.. ఆ తర్వాతే మంత్రులుగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

దీంతో ఇప్పుడు తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందా లేదా అనేది హస్తం పార్టీ నేతల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమై తెలంగాణలో పరిస్థితిని వివరించారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button