
ఇకపై రాష్ట్ర స్థాయి కి ఎస్సై పోస్టులు..!
జోనల్ వ్యవస్థను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం…
పోలీసు సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేస్తూ ప్రతిపాదనలు
క్యాబినెట్ సబ్ కమిటీకి సిఫార్సు చేసిన ప్రభుత్వం
పోలీసుల పదోన్నతులకు సంబంధించి వివాదానికి తెర దించేందుకు అధికారులు నడుం బిగించారు. జోన్లతో సంబంధం లేకుండా ఎస్సై పోస్టులను ‘రాష్ట్రస్థాయి’గా మార్చబోతున్నారు.
ఈ మేరకు పోలీసు సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలపై చర్చించేందుకు ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీకి సిఫార్సు చేసింది. అక్కడ కూడా ఆమోదం పొందితే ఇకమీదట ఎస్సై పోస్టు రాష్ట్రస్థాయిగా మారనుంది.
విద్య, ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో అప్పటి ఉమ్మడి రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించిన సంగతి తెలిసిందే. ఇందులో ఎస్సై పోస్టును జోనల్ స్థాయికి కేటాయించారు. అంటే ఏ జోన్‌కు ఎంపికైనవారు ఆ జోన్లోనే పనిచేయాలి. అక్కడే పదోన్నతి పొందాలి.
దీంతో ఒకే బ్యాచ్‌లో ఎస్సైలుగా చేరినప్పటికీ ఆయా జోన్లలో ఉన్న ఖాళీల కారణంగా కొందరికి ముందుగా పదోన్నతులు వస్తున్నాయి. అంటే ఒకే బ్యాచ్‌కి చెందినప్పటికీ కొందరు సీఐలుగా ఉంటే మరికొందరు డీఎస్పీ, అదనపు ఎస్పీలుగా పదోన్నతులు పొందుతున్నారు. ఉదాహరణకు ఆరో జోన్లో ఉన్న హైదరాబాద్‌లో ఎక్కువమంది సిబ్బంది అవసరం ఉండేది.
ఇక్కడ ఎస్సైలుగా ఎంపికైనవారికి ముందుగా పదోన్నతులు వచ్చేవి. డీఎస్పీ రాష్ట్రస్థాయి పోస్టు. అన్ని జోన్ల నుంచి ఎస్సైలు సీఐలుగా, సీఐలు డీఎస్పీలుగా పదోన్నతి పొందినప్పటికీ హైదరాబాద్ ప్రాంతంవారు ముందుగానే పదోన్నతి పొందడంతో డీఎస్పీ సీనియార్టీ జాబితాలోనూ వీరే ముందుంటారు.
హైదరాబాద్‌లో 2012 బ్యాచ్ ఎస్సైలకు పదోన్నతులు వచ్చిన చాలాకాలానికి వరంగల్‌లో 2009 బ్యాచ్ వారికి పదోన్నతులు వచ్చాయి. దాంతో 2009 బ్యాచ్ వరంగల్ అభ్యర్థులు చాలాకాలం ఆందోళన చేశారు. ప్రతి బ్యాచ్ పదోన్నతుల్లోనూ ఇదే వివాదం కొనసాగేది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్, వరంగల్ల పేరుతో రెండు ఫ్రీజోన్లు చేశారు. స్వల్ప మార్పులు మినహా గతంలో ఉన్న జోన్-5 వరంగల్ అయితే, జోన్-6 హైదరాబాద్. ఇప్పుడు కూడా ఖాళీలు ఎక్కడ ఎక్కువగా ఉంటే పదోన్నతులూ అక్కడే ఎక్కువ ఇస్తారు.
పదోన్నతుల్లో ఒక్కసారి తేడా వస్తే సర్వీసులో ఉన్నంతకాలం అది కొనసాగుతూనే ఉంటుందని, ఒకే బ్యాచ్‌కి చెందినప్పటికీ తమ హోదా తక్కువ వల్ల తోటివారికే సెల్యూట్ కొట్టాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రపతి ఉత్తర్వుల కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణలో మాత్రమే ఇలాంటి పరిస్థితి ఉంది. చాలా రాష్ట్రాల్లో కానిస్టేబుల్ పోస్టులు కూడా రాష్ట్రస్థాయిలోనే ఉంటాయి. అలాంటప్పుడు పదోన్నతులు, బదిలీలు కూడా రాష్ట్రస్థాయిలోనే జరుగుతాయి.
మన దగ్గర జోనల్ వ్యవస్థ కారణంగా బదిలీలు, పదోన్నతుల విషయంలో కొంత గందరగోళం కొనసాగుతోంది. దీన్ని చక్కదిద్దే ఉద్దేశంతోనే ఎస్సై పోస్టును రాష్ట్రస్థాయికి ప్రతిపాదిస్తూ పోలీసు సర్వీస్ రూల్స్‌లో సవరణలు చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ దీనికి ఆమోదించినట్లయితే ఆ తర్వాత జరిగే నియామకాల్లో ఎంపికైనవారికి ఇలాంటి సమస్యలు తొలగిపోతాయి.



