
నిరుద్యోగులకు శుభవార్త.. ఇక నెలకో నోటిఫికేషన్…త్వరలో 2500 పోస్టుల భర్తీకి చర్యలు
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తీపి కబురు అందించింది.
ఉద్యోగ భర్తీ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు చేస్తూ, ఇకపై ప్రతి నెలా ఒక నోటిఫికేషన్ ఇచ్చేలా పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ నిర్ణయం నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.ఈ కొత్త విధానం రాబోయే నోటిఫికేషన్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నోటిఫికేషన్ల జారీలో జాప్యాన్ని నివారించడానికి, అభ్యర్థులు తమ ప్రిపరేషన్ను ప్రణాళికాబద్ధంగా కొనసాగించడానికి టీజీపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిన సుమారు 2,500 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు.
ఇటీవల పీసీబీపొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. దీనికి ఏప్రిల్ 27 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. త్వరలోనే ఇదే విభాగంలో మరో ఏడు రకాల పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నాయి.
రాబోయే రోజుల్లో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. వాటిలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (AE) పోస్టులు.
డిప్యూటీ ఈఓలు, డైట్ లెక్చరర్లు, బీఈడీ లెక్చరర్లు. ఆర్టీసీ (RTC) సివిల్ సప్లై విభాగాల్లో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు.గతంలో మాదిరిగా పరీక్షలు ఒకే తేదీన రాకుండా (Clash) టీజీపీఎస్సీ జాగ్రత్తలు తీసుకుంటోంది.
యూపీఎస్సీ (UPSC), ఎస్ఎస్సీ (SSC) వంటి జాతీయ స్థాయి పరీక్షలు ,ఇతర రాష్ట్ర స్థాయి పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్ను రూపొందిస్తున్నారు. దీనివల్ల అభ్యర్థులు అన్ని పరీక్షలకూ హాజరయ్యే అవకాశం లభిస్తుంది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీ వేగం పుంజుకుంది.
ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఫలితాలను వెల్లడించి 26 వేల పోస్టులను భర్తీ చేశారు.గ్రూప్స్ పోస్టుల సంఖ్యను పెంచడంతో పాటు, ఇప్పటివరకు వివిధ బోర్డుల ద్వారా 70 వేలకు పైగా నియామకాలను పూర్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేరుగా నియామక పత్రాలను అందజేస్తూ నిరుద్యోగుల్లో భరోసా నింపారు.
కొత్త నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఓటీఆర్ ఉండగా, కేవలం 6 లక్షల మంది మాత్రమే ఇప్పటివరకు అప్డేట్ చేసుకున్నారు.
రెండుసార్లు గడువు పెంచినప్పటికీ చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. వరుస నోటిఫికేషన్లు రానున్న నేపథ్యంలో, చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా అభ్యర్థులు వెంటనే తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని కమిషన్ సూచించింది.
టీజీపీఎస్సీ తీసుకున్న ఈ నిర్ణయాలతో నిరుద్యోగులకు ఒక స్పష్టమైన కాలక్రమం (Calendar) అందుబాటులోకి రానుంది. దీనివల్ల గందరగోళం తగ్గి, ఉద్యోగ సాధనలో అభ్యర్థులు మరింత ఏకాగ్రతతో ప్రిపేర్ అయ్యే అవకాశం ఏర్పడింది.



