
కూర బాగోలేదని భార్యను నెట్టేసిన భర్త.. తల గోడకు తగిలి మృ*తి
web desc : కూర బాగోలేదనే చిన్న కారణంగా తలెత్తిన ఆగ్రహం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. భర్త విసిరిన చిన్న విసురు భార్య ప్రాణాల మీదికి తెచ్చిన ఘటన మైలార్‌దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. మైలార్‌దేవుపల్లి ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. శిక్షాంజలి కుమారి (19), చందన్‌కుమార్ దంపతులకు ఈ ఏడాది ఏప్రిల్ 30న వివాహం జరిగింది.
వీరు ప్రస్తుతం కాటేదాన్‌లోని శ్రీరామనగర్ కాలనీలో నివాసముంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఆదివారం సాయంత్రం భర్త చందన్‌కుమార్‌కు భార్య శిక్షాంజలి కుమారి భోజనం వడ్డించింది.
అయితే వండిన కూర బాగోలేదని ఆగ్రహానికి గురైన భర్త ఒక్కసారిగా ఆమెను బలంగా నెట్టేశాడు. ఈ ప్రమాదంలో ఆమె తల పక్కనే ఉన్న గోడకు బలంగా తగిలింది. తీవ్ర గాయాలపాలైన శిక్షాంజలి అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో భర్త హుటాహుటిన ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం ఉదయం మృతురాలి తల్లి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పెళ్లయిన కొద్ది నెలల్లోనే చిన్న విషయానికి జరిగిన గొడవలో వివాహిత ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం అలుముకుంది.




