సాధారణ కార్యకర్తపై గెలువ్ కేటీఆర్: మంత్రి తుమ్మల!!
ck news
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి, మాజీ మంత్రి కేటీఆర్ దమ్ముంటే రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరిలో తనపై పోటీ చేసే గెలవాలని సవాల్ విసిరిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరే స్థాయి బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తేల్చి చెప్పారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేటీఆర్ సవాల్ పై స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి పై పోటీ చేసే స్థాయి కేటీఆర్ కు లేదని తేల్చి చెప్పారు.
దమ్ముంటే మల్కాజ్ గిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని, కాంగ్రెస్ పార్టీ నుంచి సాధారణ కార్యకర్తను బరిలోకి దింపుతామని, కేటీఆర్ అతనిపై గెలిస్తే చాలంటూ మంత్రి తుమ్మల వ్యాఖ్యలు చేశారు.
పదేళ్లు రాష్ట్రాన్ని నిలువునా దోపిడీ చేసిన బీఆర్ఎస్ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి జిమ్మిక్కులు చేయడం ఇకనైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు.
ఇక కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కేటీఆర్ సంస్కారం గురించి మాట్లాడితే నవ్వొస్తుందన్నారు.
గతంలో మీ తండ్రి కెసిఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఎలా మాట్లాడారో తెలంగాణ సమాజం మొత్తం చూసిందని, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు మాట్లాడినప్పుడు ఎంత హేళనగా చూశారో కూడా ప్రజలు గమనించారని బల్మూరి వెంకట్ పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి రాజీనామా చేసి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరిన కేటీఆర్ కు ప్రతి సవాల్ విసిరిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తాను ఎమ్మెల్సీగా రాజీనామా చేసి మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా బరిలోకి దిగుతానని, సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేటీఆర్ కూడా పోటీకి రావాలని సవాల్ విసిరారు.
కేటీఆర్ సవాల్ ను తాను స్వీకరిస్తున్నట్లు బల్మూరి వెంకట్ వెల్లడించారు. మల్కాజ్ గిరి మాత్రమే కాదు, కేటీఆర్ కోరుకునే ఏ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అయినా తాను పోటీకి సిద్ధమంటూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రకటించారు .