వీధి వ్యాపారులపై హోంగార్డ్ గోవిందు ఖాకీల ఆగడాలు
కూరగాయలు, మాంసాహారం ఉచితంగా తీసుకెళ్తున్న పోలీసులు
డబ్బులు అడిగితే ఎస్ఐ పేరు చెప్పి బెదిరింపు
నేరేడుచర్లలో చిరు వ్యాపారులను సైతం
పోలీసులు వదలడం లేదు. పట్టణ పోలీసే స్టేషన్లో పని చేస్తున్న ముగ్గురు పోలీసులు ఏకంగా ఎస్ఐ పేరుతో కూరగాయల వ్యాపారులు, పాలు, పండ్లు, బజ్జీలు, చికెన్, మటన్ దుకాణాదారుల నుంచి సామగ్రిని ఉచితంగా తీసుకెళ్తున్నారు.
ఆదివారం స్థానిక హుజూర్నగర్ రోడ్డులో గల కూరగాయల దుకాణం వద్దకు వచ్చిన ఓ హోంగార్డ్ గోవిందు కూరగాయ లు తూకం వేయకుండానే సంచిలో వేసుకున్నాడు. ఎస్ఐ పేరు చెప్పి వెళ్లిపోతుండడంతో మహిళా వ్యాపారి అడ్డుకుంది.
ప్రతి నెలా ఎన్ని సార్లు వస్తారు.. గతంలో నాలుగైదు సార్లు ఇచ్చాం కదా.. మళ్లీ ఉచితంగా ఇవ్వాలంటే మేము బతికేది ఎట్లా అని మహిళ అతడితో వాదనకు దిగింది. దీంతో హోంగార్డు వంద నోటు ఆమె చేతిలో పెట్టి వెళ్లిపో యాడు. తమ వద్ద కూడా ఇలాగే వస్తువులను ఉచితంగా తీసుకెళ్తున్నారని మిగిలిన వీధి వ్యాపారు లు ఆరోపిస్తున్నారు.
చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్నామని, వారు అడిగినవి ఇవ్వకపోతే వేధింపులకు గురి చేస్తారేమోనని భయపడి తమకు నష్టం జరిగినా ఇస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా ఈ విషయంపై పట్టణంలో చర్చ సాగుతున్నప్పటికీ పోలీసు అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
వసూళ్ల విషయం నా దృష్టికి రాలేదు : రవీందర్నాయక్, ఎస్ఐ. నేరేడుచర్ల
నేరేడుచర్ల పట్టణంలో పోలీసులు చిరు వ్యాపా రుల వద్ద సామగ్రి ఉచితంగా తీసుకువస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేసి, ఇది వాస్తవమని తేలితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను.