ఫ్రెండ్లీ పోలీస్ కాదు.. ఇది లాఠీ పోలీస్
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
షాద్ నగర్ దళిత మహిళను పరామర్శించిన బీఆర్ఎస్ బృందం
మహిళ అని చూడకుండా అవమానకరంగా కొట్టారు
సభ్య సమాజం తలదించుకోవాలి
పోలీసులకు ఇంత పొగరు ఎలా వచ్చింది..!?
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
నందిగామ పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్ తో పోలీసుల సెటిల్మెంట్లు – ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఆరోపణలు
కెసిఆర్ ఆదేశాల మేరకు సునితను పరామర్శించినట్టు వెల్లడి
పోలీసు బాధిత మహిళలకు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి రూ. 1లక్ష తక్షణ సాయం
బాధితురాలని పరామర్శించిన ఎమ్మెల్సీ సురభి వాణీ, మాజీ ఎంపీ మంద జగన్నాథం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు తమ ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీసులు ఉండరని.. లాఠీ పోలీసులు మాత్రమే ఉంటారని చెప్పారని అది షాద్ నగర్ పోలీస్ నిజం చేశారని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో హరిజన వాడకు చెందిన సునీతను పోలీసులు దొంగతనం కేసులో చిత్రహింసలకు గురి చేశారన్న ఆరోపణలపై ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో స్థానిక ఎమ్మెల్సీ ఎన్. నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ సారధ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ సురభి వాణి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపీ జగన్నాథం తదితర స్థానిక బీఆర్ఎస్ నాయకుల బృందం బాధితురాలు సునీతను ఆసుపత్రిలో పరామర్శించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరపున తక్షణ సాయం కింద ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి 1 లక్ష రూపాయలను ఆర్థిక సాయంగా అందించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డ్యూటీ డాక్టర్ తో సునీత ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డితో పాటు మరో ఐదు మంది కానిస్టేబుల్స్ ప్రవర్తించిన తీరును బాధితురాలు సునీత వారికి వివరించింది.
చాలా అవమానీయంగా కొట్టారు.. సబితా ఇంద్రారెడ్డి
దళిత మహిళ సునీతను పోలీసులు చాలా అవమానియంగా కొట్టారని స్థానిక మీడియా ముందు సబితా ఇంద్రారెడ్డి వాపోయారు. ఒక ఆడపిల్లకు మగ పోలీసులు ఇలా చిత్రహింసలకు గురి చేయడం సబబు కాదని ఇది సభ్య సమాజం తలదించుకునే చర్య అని ఆమె ఖండించారు. పోలీసులు సిఐ రాంరెడ్డిని కంటితుడుపు చర్యగా అటాచ్ చేశారని మిగతా ఐదు మంది కానిస్టేబుళ్లపై ఎందుకు చర్య తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు.
గతంలో కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరియమ్మ అనే మహిళను చిత్రహింసలకు గురి చేస్తే సదరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ తో పాటు ఇతర సిబ్బందిని ఉద్యోగాల నుండి తొలగించడం జరిగిందని గుర్తు చేశారు. సంఘటన జరిగినప్పటి నుండి ఇప్పటివరకు సునీతకు ఎందుకు మంచి వైద్యం ఇప్పించలేదని పోలీసులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అత్యాచారాలు అఘాయిత్యాలు మానభంగాలు ఎక్కువైపోయాయని అన్నారు. ఈ సంఘటనపై స్థానిక ఏసీపీకి నివేదిక అందించడానికి ఇంకా ఎంత సమయం పడుతుందని ఆమె మీడియాతో ప్రశ్నించారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చేజారిపోయిందని ఆమె వాపోయారు. సునీత కుటుంబాన్ని ఆదుకొని ఆమెపై దాడి చేసిన పోలీసులను వెంటనే ఉద్యోగం నుండి తొలగించాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
సీఎం అండ చూసి పోలీసులకు పొగరెక్కింది
సీఎం రేవంత్ రెడ్డి అండ చూసుకొని తెలంగాణ పోలీసులకు పొగరెక్కిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలతో విమర్శించారు. సునీత నోటివెంట నిజాలు వింటుంటే తమకు బాధ కలుగుతుందని అన్నారు.
సిఐ రాంరెడ్డికి నమస్తే పెడితే బాధితురాలు గుండెలపై బూటు కాలుతో తన్నిన సిఐ రాంరెడ్డి తీరు గర్హనీయమని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, హోంమంత్రి ఒక్కడేనని ఆయన అండ చూసుకొని పోలీసులు ఇలా చెలరేగిపోతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
సీఎంను చూసుకొని మరోవైపు అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే దానం నాగేందర్ నీ అమ్మ తోలు తీస్తా అంటూ సాటి సభ్యులను బెదిరిస్తూ రౌడీయిజం చేస్తుంటే స్పీకర్ మౌనంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై గౌరవం లేకుండా ఇద్దరు మహిళ ప్రజాప్రతితులపై నోరు పారేసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఇలాంటివి సాధారణమే అని అన్నారు.
సాయంత్రం ఆరు దాటితే ఆడపిల్లలు పోలీస్ స్టేషన్లో విచారణకు తీసుకోకూడదని విషయం పోలీసులకు తెలియదా పోలీసు కమిషనర్, డిసిపి, ఏసీపీలు ఏం చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. విచారణ సమయంలో మహిళా పోలీసులు ఏమయ్యారని ప్రశ్నించారు.
వేల కోట్ల కుంభకోణం చేసిన వారిని ఇలా ఇంటరాగేషన్ చేసి కొడతారా? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీసులకు సవాల్ విసిరారు. బాధిత మహిళలకు ఒక కోటి రూపాయలు ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
రౌడీ షీటర్ తో నందిగామలో సెటిల్మెంట్లు
రాజకీయ పలుకుబడితో ఈ ప్రాంతంలో అనేక పోలీస్ స్టేషన్లో పోలీసులు విచ్చలవిడిగా కేసులు నమోదు చేస్తున్నారని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నందిగామ పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్ ప్రతినిత్యం సెటిల్మెంట్లు చేస్తున్నాడని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
చదువుకున్న పోలీసు అధికారులు రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోబడి లేదా ఒత్తిడికి గురై అమాయకులకు అన్యాయం చేస్తున్నారని నాన్బెైలబుల్ సెక్షన్లు పెడుతున్నారని అన్నారు.
ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమని ఈ ప్రాంతం పై ఉన్న పోలీస్ స్టేషన్లపై ఉన్నతాధికారులు నిఘా పెట్టాలని, వైఫల్యం పోలీసులలో లేదని.. రాజకీయ నాయకుల వైఫల్యం ఉంది కాబట్టే వారిని పావుల్లా వాడుకుంటున్నారనే విషయాన్ని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి వివరించారు.
అక్రమ కేసులు పెడుతున్నారు
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
షాద్ నగర్ నియోజకవర్గం లోని అనేక పోలీస్ స్టేషన్లలలో బాధితులపై అక్రమ కేసులు పెడుతున్నారని దీనిని సైబరాబాద్ కమిషనర్ పరిశీలించాలని స్థానిక మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ కోరారు.
అసలు జరిగిన సంఘటన ఏమిటి? ఎలాంటి సెక్షన్లు పెట్టాలి? అనే వాటిని పక్కన పెట్టి నాన్ బెయిలబుల్ కేసుల లక్ష్యంగా తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని వీటిపై దృష్టి సారించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
దళిత మహిళ సునీత విషయం చాలా బాధాకరమని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అంజయ్య యాదవ్ మీడియా ముందు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్ మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్, వెంకట్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు..