ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు…
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్టు చేసినట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు.
శుక్రవారం నేరేడ్మేట్ కార్యాలయంలో ఏర్పాటు సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న షేక్ బడే సాహేబ్, మాలిక్, లక్ష్మణాచారీలను ఎస్ఓటీ ఎల్బీనగర్ జోన్ పోలీసులు పట్టుకున్నారు.
ఈ ముఠా సభ్యులపై గతంలో ఖమ్మం టౌన్, చైతన్యపురి, సరూర్ నగర్, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లలో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఐదుగురు కలిసి ముఠాగా ఏర్పడి ఉద్యోగాల పేరుతో పలు మోసాలకు పాల్పడుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తమకు ప్రజాపాలన కాంట్రాక్టు వచ్చిందని నమ్మిస్తూ ఇప్పటి వరకు సుమారు 5 నుంచి 6 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించినట్లు సీపీ తెలిపారు. ముందుగా ఔట్ సోర్సింగ్ జాబ్ వచ్చిందని త్వరలోనే రెగ్యులర్ అవుతుందని, నకిలీ ఐడీకార్డులను ఇచ్చి నమ్మించి బారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు.
మూడు నెలల పాటు వేతనాలు ఇచ్చి నమ్మిస్తారు. ఇన్కమ్ టాక్స్, ఎఫ్ సీఐ, రెవెన్యూ , ఎలక్ట్రిసిటీ, కోర్డులలో కూడా ఉద్యోగాలంటూ ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది.
నమ్మకంగా నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు అందజేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. అంతే కాకుండా లిక్కర్ షాప్ టెండర్ వచ్చింది, మేము చేయడంలేదు మీరే తీసుకుని రన్ చేయండి అంటూ బారీగా నగదు వసూళ్లు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఐదుగురి ముఠాలో ఇద్దరు పరారీలో ఉండగా ముగ్గుర్ని పట్టుకుని వారి వద్ధ నుంచి రూ. 4 లక్షల నగదు,లాప్ టాప్, నకిలీ ఆధార్ కార్డులు, డాక్యూమెంట్స్, సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు.