తెలంగాణలో మరో “కొలువుల జాతర”
వైద్య ఆరోగ్యశాఖలో 633 ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి వివరాలు వెల్లడించారు.
అభ్యర్థులు ఈ వచ్చే నెల 5 వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అక్టోబరు 21 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించారు.
దరఖాస్తులో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని ఎడిట్ చేసుకునేందుకు వచ్చే నెల 23 తేదీ నుంచి 24 తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. నవంబరు 30 వ తేదీన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్దతిలో రాత పరీక్ష ఉంటుందని వెల్లడించారు.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పబ్లిక్ హెల్త్, డీఎంఈ విభాగాల్లో 446 , తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 185, ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రిలో 2 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు పేస్కేల్ రూ. 31,040- రూ. 92,050 గా కేటాయించారు. డి-ఫార్మసీ, బీ-ఫార్మసీ, ఫార్మా-డీ పూర్తి చేసినవారు అర్హులుగా పేర్కొన్నారు. అలాగే తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ లో తప్పక రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. మరిన్ని వివరాలకు మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు(MHSRB) వెబ్ సైట్ ను సందర్శించాలని కోరారు.