అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యార్థులకు విద్యా బోధన…
రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి
657 కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన
క్రీడలను ప్రోత్సహించేలా విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పన
*విద్యతో పాటు నైపుణ్యాల పెంపుదలకు ప్రాధాన్యత
ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ వద్ద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి
సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం రూరల్
ఖమ్మం జిల్లాలోని బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
శుక్రవారం మంత్రి, ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ వద్ద చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘు రాంరెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 28 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లకు శంకుస్థాపనలు చేసుకుంటున్నామని, పాలేరు నియోజకవర్గంలో ముందుగా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని అన్నారు.
విద్యా, వైద్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. విద్య పట్ల గడిచిన 10 నెలల కాలంలో పేదలకు మంచి చేయాలని ఉద్దేశంతో చేసిన పనిని గమనించాలని అన్నారు. 657 కోట్లు ఖర్చు చేసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన చేశామని అన్నారు.
గడిచిన 10 ఏళ్ళలో పెండింగ్ లో ఉన్న 22 వేల టీచర్ల పదోన్నతులు, 34 వేల టీచర్ల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేశామని, మెగా డీఎస్సీ ద్వారా 11 వేల 6 పోస్టులు రికార్డు సమయంలో భర్తీ చేశామని అన్నారు.
పేద ప్రజల పిల్లలు కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందుకునే దిశగా 125 నుంచి 150 కోట్లు ఖర్చు చేసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని, నేడు మొదటి విడతలో 28 పాఠశాలలకు శంకుస్థాపన చేస్తున్నామని , భవిష్యత్తులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటువంటి పాఠశాలల నిర్మాణం జరుగుతుందని అన్నారు.
విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహించేలా విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో కల్పించడం జరుగుతుందని అన్నారు. 25 ఎకరాల విస్తీర్ణం లో క్రికెట్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ వంటి క్రీడలు ఆడేందుకు వీలుగా అవసరమైన మైదానాలు, కోర్టులు ఏర్పాటు చేస్తామని అన్నారు. సుమారు 2750 నుంచి 3 వేల మంది విద్యార్థులు ఉండే విధంగా వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు.
ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న వసతుల కంటే 100 రెట్లు మెరుగ్గా మన ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థలో ఉంటాయని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్య పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.
విద్యతో పాటు యువతకు అభిరుచి ఉన్న రంగాలలో అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యునివర్సిటీ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర చైర్మన్ గా ఏర్పాటు చేసిందని, దీని భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి ఫోర్త్ సిటీ లో శంకుస్థాపన చేశారని, ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థలలో కూడా శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో ఉన్న 65 ప్రభుత్వ ఐటిఐ లను టాటా కంపెనీ తో టై అప్ చేసి ప్రభుత్వ వాటా 300 కోట్ల, ప్రైవేట్ రంగం నుంచి 2400 పైగా కోట్లు కేటాయించి వాటిని అడ్వాన్స్ ట్రైనింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్దు తున్నామని, వీటిలో శిక్షణ తర్వాత విద్యార్థులకు నేరుగా టాటా, అపోలో వంటి ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు
కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘు రాంరెడ్డి మాట్లాడుతూ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల వంటి సౌకర్యం ప్రపంచంలో ఎక్కడా లేదని, ఇది చాలా ప్రత్యేకమైందని ఎస్సి, ఎస్టీ, బీసి, మైనారిటీ వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకునేందుకు అవసరమైన సౌకర్యాలతో ప్రభుత్వం దీన్ని నిర్మిస్తుందని అన్నారు.
జాతీయ విద్యా కమిషన్ నూతన పాలసీ ప్రకారం క్లాస్ రూమ్ సైజు, ల్యాబ్ సైజ్ పాటిస్తూ భవన నిర్మాణాలు జరిగేలా చూడాలని ఎంపీ కలెక్టర్ కు సూచించారు. విద్యార్థులు చాలా మంది ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కు చదువుకునేందుకు వస్తారని, ఇటువంటి పాఠశాలను నిర్మించడం ద్వారా ఆ అవసరం రాదని అన్నారు.
మనం నిర్మించే పాఠశాలలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతం కావాలని ఎంపీ ఆకాంక్షించారు.
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాకు ఈ రోజు చారిత్రాత్మక రోజు అవుతుందని, ఏ కులం, ఏ వర్గం వారైనా మన పిల్లలకు మంచి విద్యను అందించాలని కోరుకుంటామని, అదే ఆలోచనతో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల వారికి రెసిడెన్షియల్ సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ నాణ్యమైన విద్య అందించేందుకు అద్భుతమైన మౌళిక వసతులతో సౌకర్యవంతమైన భవనాలు నిర్మిస్తుందని అన్నారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా 3 వేలకు పైగా విద్యార్థులు విద్య అభ్యసిస్తారని తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు సివిల్ పనులు నాణ్యతతో పూర్తిచేసి విద్యార్థులకు వేగవంతంగా అందుబాటులోకి తీసుకొని వస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ మ్రేనాల్ శ్రేష్ఠ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ, ఆర్ అండ్ బి ఎస్ఇ హేమలత, జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, ఖమ్మం రూరల్ మండలం తహశీల్దార్ రాంప్రసాద్, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.