మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్, చేతులెత్తేసిన హరీష్‌రావు
అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీని ఇరుకున పెట్టాలనే ఆలోచన చేసింది బీఆర్ఎస్. ఈ క్రమంలో అడ్డంగా దొరికిపోవడం బీఆర్ఎస్ వంతైంది.సోమవారం సమావేశాల్లో అదే జరిగింది. అసలేం జరిగిందంటే..
పంచాయితీ నిధుల పెండింగ్‌లపై అసెంబ్లీలో అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాము చెప్పాల్సింది చెప్పారు బీఆర్ఎస్ సభ్యులు. అయితే సభ్యులపై లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం ఏం చెబుతుందో వినకుండానే సభ నుంచి వాకౌట్ చేసింది బీఆర్ఎస్.
సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే పంచాయితీ నిధులు పెండింగ్‌పై వివిధ పార్టీల సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. గడిచిన పదేళ్లు పంచాయితీలకు నిధులు రాలేదని, కనీసం లైట్లు వేసిన సందర్భం లేదన్నారు. రోడ్లు సహా పంచాయితీలకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వానికి వివిధ పార్టీల సభ్యులు విజ్ఞప్తి చేశారు.
ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు కాసింత ఆవేశంగా మాట్లాడారు. దీనికి కౌంటరిచ్చారు మంత్రి శ్రీధర్‌బాబు. ప్రతీ నెలా 270 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశామని సభ్యులు చెప్పారని అన్నారు మంత్రి. ప్రతీనెలా నిధులు చెల్లించిన తర్వాత బకాయిలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు.
డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు సదరు మంత్రి. ఫిబ్రవరిలో సర్పంచుల పదవీకాలం పూర్తి అయ్యిందన్నారు. ఒకవేళ బకాయిలున్నా నెల రోజులకు సంబంధించి ఉంటాయని అన్నారు. ప్రతీనెల బీఆర్ఎస్ హయాంలో 270 కోట్ల రూపాయలు ఇచ్చామన్నప్పుడు, బకాయిలు ఎలా ఉంటాయని సూటిగా ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో సర్పంచులు, ఉప సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ధ్వజమెత్తారు మంత్రి శ్రీధర్‌బాబు. దీనిపై బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ బకాయిలు మా నెత్తి మీద పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారన్నారు.
బీఆర్ఎస్ పెట్టిన బకాయిలను ఒక దాని తర్వాత మరొకటి తీర్చుకుంటూ వస్తున్నా మన్నారు. సభను పక్కదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందని దుయ్యబట్టారు. సభను పక్కదాని పట్టించి కేవల రాజకీయాలతో పరపతిని పెంచుకునే ఉద్దేశం చేస్తోందన్నారు.
అంతకుముందు మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు, కాంగ్రెస్‌ది ఆపన్నహస్తం కాదని.. భస్మాసుర హస్తమన్నారు. నిబంధనల ప్రకారం సభను నడిపించ లేదన్నారు. తమ హయాంలో రెగ్యులర్‌గా పంచాయతీలకు నిధులు విడుదల చేశామన్నారు.
పంచాయితీలకు రూ. 691 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. నవంబర్‌లో బడా కాంట్రాక్టర్లకు రూ.1200 కోట్లు ఇచ్చారన్నారు. అధికార పార్టీ చెప్పింది వినకుండా సభ నుంచి వాకౌట్ చేశారు బీఆర్ఎస్ సభ్యులు.