హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హైటెన్షన్.. భారీగా పోలీసులు మోహరింపు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హైటెన్షన్.. భారీగా పోలీసులు మోహరింపు;

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హైటెన్షన్.. భారీగా పోలీసులు మోహరింపు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. సేవ్ యూనివర్సిటీ ల్యాండ్స్ పేరిట HCU (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ)లో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
విద్యార్థుల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
యూనివర్సిటీ భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై నిరసనకు దిగారు. పోలీసుల తీరుపై విద్యార్థులు మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని విద్యార్థులు ఆరోపించారు.
విద్యార్థుల ఆందోళనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈస్ట్ క్యాంపస్ ముందు బారికేడ్లు పెట్టారు. అటు ప్రభుత్వం వేలానికి పెట్టిన భూముల్లో జేసీబీలతో చదును చేస్తున్నారు. చదును చేస్తున్న వైపు వెళ్లకుండా విద్యార్థులను పోలీసులు అడ్డుకుంటున్నారు. HCU మెయిన్ గేట్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్ధులు నినాదాలు చేస్తున్నారు.
అరెస్ట్ చేసిన స్టూడెంట్స్ ను పోలీసులు బేషరతుగా విడిచి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర పరిస్థితులను మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ స్వయంగా సమీక్షిస్తున్నారు.
అసలేంటీ భూముల వివాదం?
యూనివర్శిటీకి చెందిన భూములను ప్రభుత్వం వేలానికి పెట్టింది. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ నిర్ణయంతో యూనివర్శిటీ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేలాన్ని రద్దు చేసి హెచ్‌సీయూ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వేలానికి పెట్టింది. దీన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వర్శిటీకి చెందిన భూములను వేలం వేయటమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ భూమి యూనివర్శిటీకి చెందినదని ఇక్కడ జీవ వైవిద్యాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలున్నాయని ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం వాదన మాత్రం మరోలా ఉంది. ఆ భూములతో యూనివర్శిటీకి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఆ 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదే అని అంటోంది. ఓపెన్ ఆక్షన్ ద్వారా పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించామంటోంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిధిలో (కంచ గచ్చిబౌలి) 400 ఎకరాల భూమిని టీజీఐఐసీ ద్వారా వేలం వేసేందుకు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే బిడ్డింగ్స్ కూడా దాఖలయ్యాయి. బహుళ మౌలిక సదుపాయాలు, ఐటీ పార్కులను అభివృద్ధి చేయడానికి ఈ భూములను వేలం వేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.
కంచ గచ్చిబౌలి హైదరాబాద్ ఐటీ కారిడార్ మధ్యలో ఉంది. ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల నిరసనలు రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. ఆ ప్రాంతంలో పులులు లేదా జింకలు లేవన్నారు. కానీ కొంతమంది మోసపూరిత నక్కలు అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు విద్యార్థులను రెచ్చగొడుతున్నాయని, ప్రాజెక్టును ఆపడానికి పిల్ దాఖలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.