బీజేపీకి పట్టభద్రుల ఓట్లు అడిగే హక్కు లేదు

బీజేపీకి పట్టభద్రుల ఓట్లు అడిగే హక్కు లేదు;

By :  Ck News Tv
Update: 2025-02-24 15:10 GMT

వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు..

బండి సంజయ్‌కు రేవంత్ మాస్ సవాల్

మంచిర్యాల: ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ అంటున్నారని చెప్పారు.

ఫోన్ ట్యాపింగ్ కేసును పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా వాడుకున్నారని.. గొర్రెల కుంభకోణాన్ని ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాడు కుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును ఎందుకు తీసుకు రావడం లేదని బండి సంజయ్‌ను ప్రశ్నించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను ఎప్పుడు తీసుకువస్తారో బండి సంజయ్ చెప్పాలని నిలదీశారు.

గొర్రెల స్కీమ్‌లో తాము కేసులు పెడితే ఈడీ మొత్తం ఫైళ్లను తీసుకెళ్లిందని...అందులో నిందితులను ఎప్పుడు అరెస్టు చేస్తారో చెప్పాలని నిలదీశారు. ఇవాళ(సోమవారం) మంచిర్యాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందకు పోటీ చేయడంలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్‌రావులు కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

పట్టభద్రులు గుండెలపై చేయి పెట్టుకుని ఆలోచించాలని కోరారు. కేసీఆర్ కుటుంబమంతా పట్టభద్రులే...మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన మంతనాలు ఏమిటో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డి నిలదీశారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ డిపాజిట్లను పోగొట్టుకుని ఎనిమిది చోట్ల బీజేపీ ఎంపీలను గెలిపించారని ఆరోపించారు. గెలిచిన బీజేపీ ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది ఏమిటో... మోదీ ఇచ్చింది ఏమిటో చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

మోదీ ప్రధాని అయినప్పటి నుంచి తెలంగాణకు ఏం చేశారని నిలదీశారు. తుమ్మిడి హాట్టి వద్ద ప్రాజెక్టుకు మహారాష్ట్ర నుంచి అనుమతి ఎందుకు ఇప్పించలేదని సీఎం రేవంత్‌రెడ్డి అడిగారు.

బీజేపీకి పట్టభద్రుల ఓట్లు అడిగే హక్కు లేదు

‘‘ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి విషయంలో మేం చెప్పింది నిజమనిపిస్తే కాంగ్రెస్‌కు ఓటు వేయండి...అబద్దమనిపిస్తే మీకిష్టమైన వారికి ఓటు వేయండి.

బీజేపీ నేతలకు పట్టభద్రుల ఓట్లు అడిగే హక్కు లేదు. ఐటీఐ టెక్నాలజీని ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేశాం. పట్టభద్రులకు ఉద్యోగాలు రావాలని యంగ్ ఇండియా స్కిల్డ్ యూనివర్సిటిని ఏర్పాటు చేశాం. మోదీ నిర్లక్ష్యం వల్ల ఓలింపిక్‌లో ఒక్క స్వర్ణం కూడా దక్కలేదు.. అదే సౌత్ కొరియాలో 34వచ్చాయి,

అందుకే మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయాలని తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఆదిలాబాద్‌కు యూనివర్సిటీ రావాలంటే పట్టభద్రుల అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేయాలి. నాడు వరి వేస్తే ఉరి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు...

మేం అధికారంలోకి రాగానే అదే రైతులకు రూ. 500బోనస్ చెల్లిస్తున్నాం. కేసీఆర్ రైతు బంధును ఎగ్గోట్టి పారిపోతే.... రూ.6వేల కోట్లకు పైగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల ఖాతాలో వేశాం. పదేళ్లలో కేసీఆర్ ఎప్పుడైనా స్వయం సహాయక సంఘాలను పట్టించుకున్నారా... .?? ఆలోచించండి. పదేళ్లు కేసీఆర్‌ను చూశారు..

రూ.7లక్షల కోట్లు అప్పు చేశారు.. ఆయన చేసిన తప్పులకు ప్రతి నెలా రూ. 6500 కోట్ల వడ్డీ కడుతున్నాం.. ఏడాదికి రూ.75వేల కోట్ల భారం పడుతుంది. రాష్ట్రాన్ని నాశనం చేశాడు... కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రచారం చేస్తున్నారు... అంటే బీజేపీని గెలిపించాలనే కదా. రాష్ట్రాన్ని దివాళా తీయించి ఫామ్ హౌస్‌లో పడుకున్నాడు. నేను మోదీతో కొట్లాడుతుంటే కేసీఆర్ సందేట్లో సడే మియలా నా కాళ్లు పట్టుకుని లాగుతున్నాడు.

ఇదంతా మోదీ కోసం కాదా. .?? నరేందర్ రెడ్డి ఒక వేళ ఓడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు. మోదీకి నిజంగా ఎస్సీలపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు పార్లమెంట్లో చట్టం చేయడం లేదు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మోదీని అడగడం లేదు. హైదరాబాద్‌లో మెట్రో విస్తరణను అడ్డుకుంటుంది కిషన్ రెడ్డినే.

మూసీ ప్రక్షాళనకు అనుమతి ఇవ్వడం లేదు... ఇదేనా నీ నీతి కిషన్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్డు కాకుండా ఎంపీ ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి కలిసి అడ్డు పడుతున్నారు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..

Similar News