నా కొడుకు మీద ఒట్టు అందుకే మేం మీటింగ్ పెట్టుకున్నాం..

నా కొడుకు మీద ఒట్టు అందుకే మేం మీటింగ్ పెట్టుకున్నాం;

By :  Admin
Update: 2025-02-06 16:25 GMT

*నా కొడుకు మీద ఒట్టు..*

*అందుకే మేం మీటింగ్ పెట్టుకున్నాం..*

*MLA అనిరుధ్ సంచలన వ్యాఖ్యలు*

ఏకైక పుత్రుడి మీద ఒట్టు.. మీరనుకున్నట్లు ఏమి జరగలేదు.. అది రహస్య భేటీ అని చెప్పింది ఎవరు మీకు, ఏ మంత్రిపై నాకు అసహనం లేదు..

అటువంటి చర్చనే జరగలేదు.. ఇదే ఫైనల్.. అంటూ ఆ ఎమ్మేల్యే ఓపెన్ అయ్యారు. ఇటీవల ఆ ఎమ్మెల్యే అధ్వర్యంలో రహస్య భేటీ జరిగిందని వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఏకంగా పది మంది ఎమ్మేల్యేలు భేటీలో పాల్గొన్నారని కూడ వార్తలు హల్చల్ చేశాయి. ఎట్టకేలకు గురువారం ఆ వార్తలకు శుభం కార్డు వేస్తూ మీడియా ముఖంగా ఓపెన్ అయ్యారు.

జడ్చర్ల ఎమ్మేల్యే అనిరుధ్ రెడ్డి ఇటీవల పది మంది ఎమ్మేల్యేలతో రహస్య భేటీ నిర్వహించి, ఓ మంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వదంతులు వ్యాపించాయి. ఆ వదంతులకు చెక్ పెడుతూ.. గురువారం సీఎల్పీ సమావేశం అనంతరం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అనిరుధ్ రెడ్డి ప్రమాణం చేసి మరీ చెప్పడం విశేషం.

కాగా తెలంగాణ సీఎల్పీ సమావేశం గురువారం నిర్వహించగా.. సమావేశంలో ఇటీవల ఎమ్మెల్యేల రహస్య భేటీ ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా ఆ భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యేలందరూ.. తాము కేవలం డిన్నర్ కోసమే కలిసామని వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని, ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా పీసీసీ అధ్యక్షులకు గానీ, ఏఐసీసీ ఇన్చార్జికి, ఇంచార్జ్ మంత్రికి, లేదా తనకైనా చెప్పాలని సూచించారు. ఇక సమావేశం అనంతరం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీలింగ్ భూములన్నీ పట్టాలు చేసుకున్నారని, అది కూడా ఆ పార్టీకి చెందిన నేతలే ఈ వ్యవహారంలో ఉన్నట్లు ఆరోపించారు. ఈ విషయంపై ప్రభుత్వం విచారణ నిర్వహించాలని తాను కోరినట్లు తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ బినామీ నేతలు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్లు ఎమ్మెల్యే ఆరోపించారు. సీలింగ్ భూములన్నీ గిరిజనులకు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. పూర్తి ఆధారాలతో తాను సీఎంకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

ఇక రహస్య భేటీ గురించి మాట్లాడిన ఎమ్మెల్యే.. తనకు ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడని, తన కుమారుడిపై ప్రమాణం చేసి చెబుతున్నా అంటూ.. తనకు ఎటువంటి పర్సనల్ ఫైల్ లేదని, నియోజకవర్గ సమస్యలపై మాత్రమే చర్చించడం జరిగిందని తేల్చి చెప్పారు. ఏ మంత్రిపై అసహనం లేదంటూ.. రహస్య భేటీ అనే ధోరణిలో మీడియా చూపిందంటూ ఎమ్మెల్యే అన్నారు.

Similar News