కాంగ్రెస్ పార్టీ కి తీన్మార్ మల్లన్న రాజీనామా చేస్తారా?*

కాంగ్రెస్ పార్టీ కి తీన్మార్ మల్లన్న రాజీనామా చేస్తారా?*;

By :  Admin
Update: 2025-02-06 15:08 GMT

*కాంగ్రెస్ పార్టీ కి తీన్మార్ మల్లన్న రాజీనామా చేస్తారా?*

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంటున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న చింతపండు నవీన్‌ కుమార్‌కు కాంగ్రెస్‌ పార్టీ భారీ షాక్‌ ఇచ్చింది.

ఓ సామాజిక వర్గాన్ని దూషిస్తుండడమే కాకుండా కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా.. రేవంత్‌ రెడ్డిపై దుర్భాషలాడడం.. ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో వివరణ ఇవ్వాలని నోటీసు అందించింది. కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణా సంఘం మల్లన్నకు నోటీసులు పంపించింది. ఫిబ్రవరి 12వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాల్లో కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది.

పార్టీ అగ్ర నాయకత్వం దిశానిర్దేశంతో బీసీలకు సంబంధించి కుల గణన చేపట్టినట్లు కాంగ్రెస్‌ పార్టీ క్రమ శిక్షణా సంఘం జారీ చేసిన నోటీసుల్లో గుర్తు చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ బీసీ కుల గణనపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం తగదని బీసీల అంశంలో పార్టీ లైన్‌ దాటి ప్రవర్తించారని గుర్తుచేసింది. 'మీరు కాంగ్రెస్‌ పార్టీ బీ ఫారంపై వరంగల్‌-ఖమ్మం-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన విషయాన్ని మరచిపోతున్నారు' అంటూ ఒక విధంగా ఆ పార్టీ హెచ్చరించింది. ఆ విషయాన్ని మరచి ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. సరైన వివరణ ఇవ్వకపోతే పార్టీ కఠిన చర్యలకు కూడా వెనుకాడదని కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ జి.చిన్నారెడ్డి స్పష్టం చేశారు.

ఈ నోటీసుల్లో బీసీ కులగణనను ప్రభుత్వం ఎలా చేపట్టిందో సవివరంగా తీన్మార్‌ మల్లన్నకు వివరించింది. అలాంటి సర్వేపై విచక్షణా రహితంగా విమర్శలు చేయడమే కాకుండా కుల గణన పత్రాలను దహనం చేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఇప్పటికే మంత్రులు, ఓ సామాజిక వర్గం నాయకులు మల్లన్నపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నాయకులు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఇంకోవైపు కొన్ని సంఘాల నాయకులు మల్లన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ షోకాజ్‌ నోటీసులపై తీన్మార్‌ మల్లన్న ఎలా స్పందిస్తారోనని ఆసక్తి నెలకొంది. ఇప్పటికే నోటీసులు ఇచ్చేందుకు వాళ్లెవరు? అని మల్లన్న ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ వివాదం మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో తీన్మార్‌ మల్లన్న కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News