ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసును వాయిదా వేసిన సుప్రీంకోర్టు
సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది;
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసును వాయిదా వేసిన సుప్రీంకోర్టు
సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ వారు ఈ పిటిషన్ పెట్టారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటరీ ప్రక్రియను ఫ్రస్ట్రేషన్‌కు గురి చేయొద్దని, ప్రజాస్వామ్యంలో పార్టీలకు హక్కులు ఉంటాయని తెలిపింది. రీజనబుల్ టైమ్ అంటే ఎంత సమయం కావాలో చెప్పండని కోర్టు లేవనెత్తింది. అనంతరం ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, ఈ పిటిషన్‌పై విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.
బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వీరి పట్ల అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. పార్టీ మార్పులు ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించేలా ఉంటాయని కేటీఆర్ ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల చర్యలతో ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేసినట్లు కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ కేసు తదుపరి విచారణకు వేచి చూడాల్సి ఉంది.