మంత్రివర్గ విస్తరణ పై చేతులెత్తేసిన సీఎం రేవంత్
అధిష్టానం దే తుది నిర్ణయం;
మంత్రివర్గ విస్తరణ పై చేతులెత్తేసిన సీఎం రేవంత్
*అధిష్టానం దే తుది నిర్ణయం*
తెలంగాణ కేబినెట్ విస్తరణ లేనట్లేనని సీఎం రేవంత్ సంచలన ప్రకటన చేశారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. మంత్రివర్గంలో తీసివేతలు, కూడికలపై హైకమాండ్ దే నిర్ణయమని తేల్చి చెప్పారు.
ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళతామన్నారు. తనకు ఉన్న అవకాశం మేరకు అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నానన్నారు. కుల గణన ఆషామాషీగా చేసింది కాదన్నారు. ఎంతో పకడ్బందీగా చేశామన్నారు. పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చిందని.. ఈరోజు లేదా రేపు ప్రకటన ఉంటుందని తెలిపారు. తాను రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోరలేదన్నారు. తనకు రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ లేదని స్పష్టం చేశారు. తమ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందన్నారు.
డిసెంబర్ 7న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తన కేబినెట్ లోకి 11 మందిని మాత్రమే తీసుకున్నారు. ఈ సమయంలో నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చోటు దక్కలేదు. అయితే.. త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని ఆ సమయంలో సీఎం ప్రకటించారు. కానీ ఏడాది దాటినా ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ కార్యరూపం దాల్చలేదు. దీంతో మంత్రివర్గంలో చోటుపై ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు ఇప్పటికే అసమ్మతి గళం విప్పడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్లేనని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పడం సంచలనంగా మారింది. ఈ ప్రకటనపై మంత్రివర్గంలో చోటు కోసం ఎదురు చూస్తున్న వారు ఎలా రియాక్ట్ అవుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
విస్తరణకు బ్రేక్ అందుకేనా?
మంత్రి వర్గ విస్తరణ పూర్తి చేస్తే చోటు దక్కని వారు పంటి కింద రాయిలా మారుతారని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారి ఆశలు సజీవంగా ఉంచేందుకే విస్తరణ పూర్తి చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల పది మంది ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్, ఢిల్లీకి వెళ్లి మరి జూపల్లి కంప్లైంట్ ఇవ్వడం లాంటి పరిస్థితుల నేపథ్యంలో తేనె తుట్టెను కలపడం ఏ మాత్రం సరికాదనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.