ఆస్తి కోసం మరిదిని హత్య చేసిన వదిన
వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.;
వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం క్రూరంగా ఆలోచించిన వదిన.. తన మరిదిని హతమార్చేందుకు కుట్ర చేసింది.
రూ.50వేలు ఇస్తా.. నా మరిదిని హత్య చేయాలని అదే గ్రామానికి చెందిన ముగ్గురితో ఒప్పందం కుదుర్చుకుంది. ముగ్గురు వ్యక్తులు ప్లాన్ ప్రకారం తమ పనిని పూర్తి చేశారు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు విచారణ మొదలు పెట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వదిన బండారం మొత్తం బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవల్గాకు చెందిన మాల మల్లమ్మకు మాల నర్సింములు, శ్యామప్ప, శ్యామమ్మ సంతానం. శ్యామప్ప భార్య నాలుగేళ్ల క్రితం భర్తను వదిలేసి కూతురును తీసుకొని పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి శ్యామప్ప తన చెల్లితో కలిసి ఉంటున్నాడు. వారు ఉంటున్న ఇంట్లోనే మరోభాగంలో నర్సిములు, అతని భార్య సుగుణ ఉంటున్నారు. ఎలాగైనా ఆ ఇంటి మొత్తాన్ని తమ సొంతం చేసుకోవాలని సుగుణ కుట్ర చేసింది. దీంతో తేన మరిది శ్యామప్ప(39)ను హత్యచేయిస్తే ఆ ఇల్లు మొత్తం మాకే సొంతం అవుతుందని భావించింది. అదేగ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులతో కలిసి మరిది హత్యకు ప్లాన్ చేసింది. రూ.50వేలు ఇస్తా.. మా మరిదిని హత్యచేయాలని వారికి సూచించింది. ముందుకు రూ.10వేలు అడ్వాన్స్ ఇచ్చింది.
బషీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో గ్లౌజులు తీసుకున్న ముగ్గురు వ్యక్తులు.. మద్యం తాగేందుకుని శ్యామప్పను తీసుకొని గ్రామ శివారులోకి వెళ్లారు. మద్యం తాగిన తరువాత శ్యామప్ప తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. ఆ తరువాత శ్యామప్ప మృతదేహాన్ని రోడ్డుపై తీసుకొచ్చి పడేశారు. తద్వారా రోడ్డు ప్రమాదంగాచిత్రీకరించే ప్రయత్నం చేశారు. తెల్లవారు జామున అటువెళ్లే వ్యక్తులు శ్యామప్ప మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసుల విచారణ నిమిత్తం మృతుడు తల్లి మల్లమ్మ, సోదరి శ్యామమ్మను విచారించి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్వ్కాడ్స్ ను రంగంలోకి దింపారు. అయితే, పోలీసులకు సుగుణ ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సుగణతో పాటు ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.