అందుకే కేసీఆర్‌పై ఒక్క కేసు నమోదు కాలేదు
ఢిల్లీ: ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసేందుకే బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ అన్నారు. సోమవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రానికి సీఎంగా రేవంత్ రెడ్డి సరైనోడని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ముద్దుబిడ్డ మాజీ సీఎం కేసీఆర్ అని ఆరోపించారు.
కాంగ్రెస్, ఇండియా కూటమికి మద్దతిచ్చే పార్టీల నేతలే టార్గెట్‌గా మోదీ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఉద్ధవ్ ఠాక్రే, హేమంత్ సోరెన్, ఎన్సీపీ, విపక్ష నేతలే టార్గెట్‌గా బీజేపీ దాడులు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ కట్టి అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయిందని అన్నారు.
బీఆర్ఎస్‌ను బెదిరించేందుకే ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాంను సాకుగా వాడుకుంటున్నారని అన్నారు. లిక్కర్ స్కాంలో మొదట వేటు వేయాల్సింది లెఫ్టినెంట్ గవర్నర్ పైనే అని చెప్పారు. లెఫ్టినెంట్ గవర్నర్‌ను కాపాడింది ఎవరు? ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని ప్రశ్నించారు.
అలా ఎదగలని బీజేపీ కుట్రలు చేస్తుంది..
కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న కారణంగానే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. లీడర్ లేని పార్టీగా బీఆర్ఎస్ తయారైందని చెప్పారు. కేసీఆర్‌కు అనుకూలంగా ఉండే కిషన్ రెడ్డిని తెలంగాణ అధ్యక్షుడిగా నియమించారని చెప్పారు.
బిజీగా ఉన్నానని చెబితే కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి మినహాయింపు ఇచ్చినట్లు, హేమంత్ సోరెన్, సోనియా గాంధీ లాంటి మిగతా నాయకులకు ఎందుకు ఇవ్వరు? అని నిలదీశారు. కాళేశ్వరం అవినీతిపై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన అవినీతిని కాపాడింది బీజేపీనేనని చెప్పారు. అవినీతి పరులను ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
కాళేశ్వరం అనుమతులు ఇచ్చిన వారిని కూడా వదలమని మందలించారు. తెలుగు రాష్ట్రాలకు బీజేపీ చేసిందేం లేదన్నారు. కాంగ్రెస్ వైపు ప్రజలున్నారని.. బీజేపీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
తన భవిష్యత్తు ఏఐసీసీ అధిష్ఠానం, సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేతుల్లో ఉందని తెలిపారు. కాంగ్రెస్ తనను ఒక అస్త్రంగా వాడుకుంటుందేమోనని.. తనకు మంచి అవకాశం వచ్చే ఛాన్స్ ఉందని అద్దంకి దయాకర్ అన్నారు..