అవయవ దానంతో పదిమందికి పునర్జన్మ
సి కే న్యూస్ (సంపత్) మే 11
తాను మరణించాక తన శరీరాన్ని దహనం చేయకుండా స్వచ్ఛందంగా వైద్య సంస్థలకు అప్పగించాలని కోరుతూ తెలుగు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు కోదాడ రాజీవ్ చౌక్ సెంటర్ లో అశేష జన సమక్షంలో శుక్రవారం స్పందన అవయవ దానసంస్థ ప్రతినిధులకు అంగీకార పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా స్పందన సంస్థ అధ్యక్షులు గుండా రమేష్ మాట్లాడుతూ ఎవరైనా వ్యక్తి సహజ మరణం లేదా బ్రెయిన్డెడ్ అయిన సందర్భంలో కాలేయము, గుండె, కండ్లు,మూత్రపిండాలు దానం చేసి ఇతరులకు పునర్జన్మ కలిగించడం అత్యంత పవిత్రమైన కార్యక్రమమని వివరించారు.
ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి కొల్లు వెంకటేశ్వరరావు ముందుకు రావడం అభినందనీయమని ప్రశంసించారు.శరీరదాత కొల్లు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మరణానంతరం శరీరాలను దహనం చేసినందున ప్రయోజనం లేదని, పైగా వాయు కాలుష్యం వల్ల ఎన్నో అనర్ధాలు ఉన్నాయని చెప్పారు.
జీవితం తనదైనా శరీరం తన తండ్రి ఇచ్చిందని, అందుకని తన తండ్రి వర్ధంతి సందర్భంగా తన పార్ధివ శరీరాన్ని వైద్య పరీక్షలకు,అవయవ దానాలకు ఉపయోగపడేలా వైద్య సంస్థలకు దానం చేయాలని స్పందన అవయవ దానసంస్థకు శరీర దాన పత్రాలను అందజేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా పాదాచారులకు, కూలీలకు, పేదలకు అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు గాధంశెట్టి శ్రీనివాసరావు, యాదా సుధాకర్,పుల్లకొండం సాంబశివరావు, గుడుగుంట్ల సాయి, పైడిమర్రి రామారావు, దేవరశెట్టి శంకర్, డోగుపర్తి హైమావతి, కందిబండ నాగేశ్వరరావు, చిట్టిప్రోలు నారాయణ,పైడిమర్రి సుధాకర్, వంగవేటి రంగారావు తదితరులు పాల్గొన్నారు.