
అసెంబ్లీలో కీలక పరిణామం.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ ప్రారంభం
బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు
వీరిపై అనర్హత పిటిషన్ల విచారణ ప్రారంభించిన స్పీకర్
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో వ్యక్తిగత విచారణ
స్పీకర్ ఎదుట హాజరవుతున్న ఎమ్మెల్యేలు, వారి న్యాయవాదులు
విచారణ నేపథ్యంలో అసెంబ్లీలో అక్టోబర్ 6 వరకు కఠిన ఆంక్షలు
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లపై కీలక ముందడుగు పడింది.
బీఆర్ఎస్ తరఫున గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది శాసనసభ్యుల భవితవ్యాన్ని తేల్చేందుకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ ప్రక్రియను ప్రారంభించారు. ఈ మేరకు సోమవారం అసెంబ్లీ భవనంలో ప్రత్యేక ట్రిబ్యునల్ ముందు విచారణ మొదలైంది.
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ (పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం) కింద జరుగుతున్న ఈ విచారణకు తొలుత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తన న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు. ఆయన వాదనలు విన్న తర్వాత, మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరిగా స్పీకర్ ముందు హాజరుకానున్నారు.
మధ్యాహ్నం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తమ న్యాయవాదులతో కలిసి స్పీకర్‌కు వివరణ ఇవ్వనున్నారు.
మరోవైపు, ఈ పిటిషన్లను దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింత ప్రభాకర్ కూడా విచారణలో పాల్గొననున్నారు.
ఈ విచారణ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. అక్టోబర్ 6వ తేదీ వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని అసెంబ్లీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.
విచారణకు హాజరయ్యే పిటిషనర్లు, ప్రతివాదులు, వారి తరఫు న్యాయవాదులు ఎవరూ కోర్టు హాల్‌లోకి మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
నిబంధనలు అతిక్రమించి విచారణను రికార్డు చేసినా లేదా ఫోటోలు తీసినా వారి ఫోన్లను జప్తు చేస్తామని హెచ్చరించారు. ఈ పరిణామంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది.




