కొలువుల పేరిట యువతకు టోకరా.. నిరుద్యోగులే టార్గెట్ గా చేసుకొని దళారుల వ్యాపారం… ఖమ్మం జర్వజనాసుపత్రిలో విచారణ చేపట్టిన డీఎంహెచ్‌ఓ మాలతి, ఆసుపత్రి ఉద్యోగులు. రూ.3 లక్షలకు ఖమ్మం సర్వజనాసుపత్రిలో సూపర్‌వైజర్‌ పోస్టు ఇస్తామని చెప్పి నమ్మించారు.మీరు పని చేసేది ఈ ఆసుపత్రిలోనే అని రెండు రోజుల కిందట నిరుద్యోగులను తీసుకొచ్చి చూపించారు. సోమవారం డబ్బులు ఇచ్చి నియామక పత్రాలు తీసుకోవాలని చెప్పటంతో నలుగురు నిరుద్యోగులు వచ్చారు. వారితో చర్చిస్తుంటే అనుమానం వచ్చిన ఆసుపత్రి సిబ్బంది పట్టుకొని …

కొలువుల పేరిట యువతకు టోకరా..

నిరుద్యోగులే టార్గెట్ గా చేసుకొని దళారుల వ్యాపారం…

ఖమ్మం జర్వజనాసుపత్రిలో విచారణ చేపట్టిన డీఎంహెచ్‌ఓ మాలతి, ఆసుపత్రి ఉద్యోగులు.

రూ.3 లక్షలకు ఖమ్మం సర్వజనాసుపత్రిలో సూపర్‌వైజర్‌ పోస్టు ఇస్తామని చెప్పి నమ్మించారు.
మీరు పని చేసేది ఈ ఆసుపత్రిలోనే అని రెండు రోజుల కిందట నిరుద్యోగులను తీసుకొచ్చి చూపించారు. సోమవారం డబ్బులు ఇచ్చి నియామక పత్రాలు తీసుకోవాలని చెప్పటంతో నలుగురు నిరుద్యోగులు వచ్చారు.

వారితో చర్చిస్తుంటే అనుమానం వచ్చిన ఆసుపత్రి సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో ఫోర్జరీ సంతకాలతో తయారుచేసిన నియామక పత్రాలు వెలుగుచూశాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సూపర్‌వైజర్‌ ఉద్యోగాలు… ఖమ్మం సర్వజనాసుపత్రిలో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ సూపర్‌వైజర్‌ ఉద్యోగాలు ఉన్నాయని దళారులు నిరుద్యోగులను నమ్మించారు. రూ.3 లక్షల చొప్పున చెల్లించాలని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇక్కడ సోమవారం నుంచి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని నమ్మించారు.

సత్యనారాయణ, శ్రీనివాస్‌ దళారులుగా వ్యవహరించి రూ.3 లక్షల చొప్పున తీసుకొని ఫోర్జరీ నియామక పత్రాలు ఇచ్చేందుకు వచ్చారు. నగదు ఇచ్చి నియామక పత్రం తీసుకుందామని నిరుద్యోగులు నీలం శ్రీలత, నీలం కిరణ్‌బాబు, ఎండీ అష్రాఫ్, మరో మహిళ ఆసుపత్రి వద్దకు వచ్చారు (ఒకరు శనివారమే వచ్చారు).

ఖమ్మం సర్వజనాసుపత్రి కార్డియాలజీ విభాగం వద్ద కొత్తపల్లి సత్యనారాయణ, విజయగిరి శ్రీనివాస్‌ సోమవారం తచ్చాడుతుండటంతో సిబ్బందికి అనుమానమొచ్చింది. నిరుద్యోగులతో చర్చిస్తుండటంపై నిఘా ఉంచారు. గత శనివారం ఆసుపత్రికి ఒకరు ఇలాగే నకిలీ నియామక పత్రంతో రావడంతో సిబ్బందికి సందేహం వచ్చింది. సత్యనారాయణ, శ్రీనివాస్‌ను సోమవారం పట్టుకొని కార్యాలయంలో కూర్చోబెట్టి ఖమ్మం టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించటంతో హైదరాబాద్‌కు చెందిన పూర్ణ, బాలాజీ తమను పంపించారని, నగదు తీసుకుని నియామక పత్రాలు ఇవ్వాలని చెప్పినట్లు నిందితులు తెలిపారు.

దళారులతో చర్చిస్తుండగా కార్డియాలజీ విభాగం సిబ్బంది పట్టుకున్నారు. వారి వద్ద ఈనెల 1వ తేదీతో రూపొందించిన నియామక పత్రాలు లభించాయి. ఈ పత్రాల్లో ఖమ్మం డిప్యూటీ కమిషనర్, ఖమ్మం డిస్ట్రిక్ట్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ (డీఎంహెచ్‌ఓ) పేరిట ఫోర్జరీ సంతకాలు ఉన్నాయి.

ఈ ఆసుపత్రిలో డిప్యూటీ కమిషనర్‌ పోస్ట్‌ లేకపోవటం గమనార్హం.కేసు నమోదు.. ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎల్‌.కిరణ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు ఖమ్మం టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తన సంతకం ఫోర్జరీ చేశారంటూ డీఎంహెచ్‌ఓ డా.మాలతి సైతం పోలీసులకు మరో ఫిర్యాదు ఇచ్చారు.

దళారులను నమ్మి మోసపోవద్దు: డా.మాలతి, డీఎంహెచ్‌ఓ, ఖమ్మం

ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి విధివిధానాలు ఉన్నాయి. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇచ్చి నియామకాలను చేపడుతుంది. ఎవరైనా ఉద్యోగాలు అని నమ్మిస్తే సదరు కార్యాలయానికి వెళ్లి విచారిస్తే నిజాలు తెలుస్తాయి. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. ఇటువంటి సమయంలో ఉద్యోగ నియామకాలు జరగవు.

Updated On 4 Jun 2024 12:40 PM IST
cknews1122

cknews1122

Next Story