ఆస్తి కోసం బామ్మర్దిని హత్య చేయించిన బావ
రూ.10 లక్షలతో సుపారీ డీల్
ఆలస్యంగా వెలుగులోకి ఘటన
డబ్బే ముఖ్యం అన్నట్లు ఏం చేయడానికైనా దిగజారుతున్నారు. ఆస్తి కోసం సొంత వారిని సైతం మోసం చేసే వారు కొందరైతే.. చివరకు హత్యలు చేసేందుకూ వెనుకాడని వారు మరికొందరు. ఆస్తి కోసం తమ్ముణ్ని మోసం చేసిన అన్న, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను రోడ్డుపైకి నెట్టేసిన కుమారులు, అక్కను మోసం చేసిన తమ్ముడు అంటూ వివిధ కథనాలు మనం రోజూ చూస్తునే ఉంటాం.
తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. బాయ్స్ హాస్టల్ పెట్టిన ఓ వ్యక్తి బెట్టింగులకు బానిసై అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అందులో నుంచి బయటపడేందుకు బామ్మర్ది ఆస్తిపైనే కన్నేశాడు. అతణ్ని చంపేసేందుకు పథకం వేసి చివరికి అనుకున్నంత పనీ చేశాడు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించిన ఆస్తి మెుత్తం నొక్కేద్దామని కుట్ర పన్నాడు.
అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తీగ లాగితే డొంక కదిలినట్లు పోలీసుల విచారణలో నిందితుడు చేసిన దారుణం తెలుసుకుని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
నెల్లూరు జిల్లా కావలికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి హైదరాబాద్ గచ్చిబౌలిలో బాలాజీ పీజీ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. శ్రీకాంత్‌కు క్రికెట్ బెట్టింగులు వేసే అలవాటు ఉంది. దీంతో సుమారు రూ.5కోట్ల మేర అప్పులు చేశాడు.
దీని నుంచి బయపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. మరోవైపు తన బామ్మర్ది యశ్వంత్(25) చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం వేటలో నగరానికి వచ్చాడు. బావ హాస్టల్లోనే ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అప్పుల ఊబిలో కూరుకున్న శ్రీకాంత్‌కు ఓ ఆలోచన వచ్చింది.
తనకు ఒక్కడే బామ్మర్ది కావడంతో అతణ్ని చంపి ఆస్తి కొట్టేయాలని అనుకున్నాడు. దీంతో ఓ ఇద్దరికి సుపారీ ఇచ్చి పథకం ప్రకారం సెప్టెంబర్ 1న హత్య చేయించాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించాడు. దీనిపై అదే రోజు గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైంది.
అనంతరం బాధితుడి స్వగ్రామం నెల్లూరు జిల్లా కావలికి మృతదేహాన్ని తరలించారు. తమ కుమారుడి మృతదేహం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే అదే సమయంలో వారికి అతని శరీరంపై గాయాలు కనిపించాయి.
ఆ బాధలో వారు దానిపై ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తలేదు. అయితే కుమారుడి మృతిపై అనుమానం ఉన్న తండ్రి విషయం తెలుసుకునేందుకు నిన్న(శుక్రవారం) గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు తమ సైల్లో విచారణ చేపట్టారు. ప్రధాన నిందితుడు, మృతుడి బావ శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆస్తి కోసం తానే హత్య చేయించినట్లు ఒప్పుకున్నాడు.
దీంతో కుటుంబసభ్యులంతా అవాక్కయ్యారు. అతను చేసిన పనికి గుండెలు పగిలేలా ఏడ్చారు. అయితే సుపారీ తీసుకున్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.