రోగులకు మెరుగైన వసతులతో వైద్య సేవలు అందించాలి….జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఆసుపత్రికి అవసరమైన పరికరాలు, సౌకర్యాల ప్రతిపాదనలు సమర్పించాలి
జిల్లా ప్రధాన ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం, సెప్టెంబర్ 25:
ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వసతులతో వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
బుధవారం జిల్లా కలెక్టర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రధాన ఆస్పత్రిలోని క్యాజువాలిటి, ఏఎంసి, జనరల్ వార్డులు, వెయిటింగ్ హాల్, ఐసియూ, ఫార్మసి, మెడికల్ రూమ్ లు, ఓపి, ఫిజియోథెరపి రూమ్ లను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగుల సహాయకులతో కలెక్టర్ మాట్లాడి, అందుతున్న సేవలు, ఆస్పత్రిలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు. ఆసుపత్రికి అవసరమైన పరికరాల, సౌకర్యాల గురించి ప్రతిపాదనలు త్వరగా అందించాలని కలెక్టర్ తెలిపారు.
ఆసుపత్రిలో రోగులకు అందించే పౌష్టికాహారం, భోజనం రుచికరంగా, పౌష్టికాహారంతో కూడుకున్నదై ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో మందుల రికార్డులు, ఇతర రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.
ఆసుపత్రిలోని ఆర్.ఓ.బి. ప్లాంట్ నిర్వహణ వివరాలు తెలుసుకున్న కలెక్టర్ అవసరాల మేరకు నూతన ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించాలని అన్నారు. టూ వీలర్ పార్కింగ్ నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. పార్కింగ్ కు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణ పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆసుపత్రికి వచ్చిన రోగికి వైద్యం నిమిత్తం ఏ విభాగం ఎక్కడ ఉంటుందో తెలిసేలా చర్యలు తీసుకోవాలని, టాయిలెట్ మరమ్మత్తు పనులు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హెచ్డిఎస్ కమిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు.
కలెక్టర్ తనిఖీ సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. రాజేశ్వర రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కిరణ్ కుమార్, సీఎస్ఆర్ఎంఓ డా. కళావతి బాయి, డిప్యూటీ సీఎస్ఆర్ఎంఓ డా. రాంబాబు, వైద్యాధికారులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.