సర్పంచ్‌గా పోటీ చేసే ఆశావాహులకు శుభవార్త…
గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ లాంటి స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థికి ముగ్గురు బిడ్డలు ఉంటే అనర్హులు అవుతారనే ప్రధానమైన నిబంధన ఉండేది.
కానీ సర్పంచ్‌గా పోటీ చేసే ఆశావాహుల నుంచి వినతులు పెద్ద ఎత్తున రావడంతో ఈ నిబంధనలకు రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే ఆశావాహులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇదివరకు సర్పంచ్‌గా పోటీ చేయాలి అంటే ఇద్దరు పిల్లలు మించి ఉండకూడదనే నిబంధన ఉండేది.
కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ నిబంధనను తొలగిస్తూ ముగ్గురు లేదా ఆపై ఎంతమంది పిల్లలున్నా కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి అర్హులు అవుతారని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. ముగ్గురు పిల్లలు ఉండి సర్పంచ్‌గా పోటీ చేయాలి అనే వారికి రేవంత్ ప్రభుత్వం ఊరట కల్పించిందని అన్నారు.
ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులకు పిల్లల సంఖ్య బెడద తప్పింది. గతంలో ఇద్దరు పిల్లలు ఉన్న వారికి మాత్రమే పోటీ చేసే అవకాశం ఉండేది. ముగ్గురు అంతకన్నా ఎక్కువమంది పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు.
కానీ, 2019 మున్సిపల్ చట్ట ప్రకారం పిల్లలు ఎంతమంది ఉన్నా ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ఆటంకాలు లేవని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అభ్యర్థులకు ఏఏ సందర్భాల్లో ఇందులో మినహాయింపులతో కూడిన వెసులుబాట్లు లభిస్తాయి అన్న విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన వివరణ ఇవ్వాల్సి ఉంది.
కాగా, గతంలో పంచాయతీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థికి ముగ్గురు పిల్లల విషయంలో అనర్హతకు సంబంధించిన చట్టం 1994 మే 30 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ తేదీకి ముందు ఎంత మంది పిల్లలున్నా అర్హులవుతారు.
చట్టం అమల్లోకి వచ్చిన ఒక సంవత్సరంలోగా అంటే 1995 మే 29 లోగా మూడో బిడ్డ పుట్టినా అనర్హులు కాకుండా కూడా మినహాయింపు ఉంది. 1995 మే 30 ఆ తర్వాత జన్మించే పిల్లలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. దత్తత తీసుకున్న పిల్లలతో సహా ఇద్దరికి మించినట్లయినా అర్హులే అవుతారు.
దత్తతకు సంబంధించిన పిల్లలు అసలు తల్లిదండ్రుల లెక్కలోనే ఉంటారు. ఈ మేరకు 2006లో హైకోర్టు కూడా ఈ తీర్పు ఇచ్చింది. అదే విధంగా అభ్యర్థికి ముగ్గురు పిల్లలు ఉండి ఒకరిని దత్తత ఇచ్చేసినా అనర్హులే అవుతారు.
అభ్యర్థి మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలను కలిగి రెండో భార్య ద్వారా మరో బిడ్డను జన్మనిస్తే అనర్హుడి కిందే లెక్క. అయితే మొదటి భార్య ఒక బిడ్డను మాత్రమే జన్మనిస్తే రెండో భార్యకు మాత్రం అనర్హత వర్తించదు. నామినేషన్ వేసే నాటికి ముగ్గురు పిల్లలు ఉండి, పరిశీలన జరిగే రోజుకు అందులో ఒకరు చనిపోయినా కూడా అర్హుడవుతారు.
ఇదివరకే ఇద్దరు పిల్లలు కలిగి ఉండి మూడోసారి గర్భం ధరించినా.. అధికారులు పిల్లల లెక్క పరిశీలన కోసం వచ్చే తేదీ నాటికి ఇద్దరే పిల్లలున్నందున అర్హులు అవుతారు. 1995 మే 29 నాటికి ఒక బిడ్డ మాత్రమే ఉండి ఆ తర్వాత ఇద్దరు కవలలు పుట్టినా అర్హుడేఅవుతారు.
ఆ తేదీతో నిమిత్తం లేకుండా మొదటి కాన్పులో ఒక బిడ్డ కలిగి తర్వాత కవలలు జన్మించినా అర్హులే అవుతారు. అయితే మొదటి కాన్పులో కవలలు కలిగిన తర్వాత మరో బిడ్డ జన్మనిస్తే అనర్హుడవుతారు. అదే విధంగా ఒకే కాన్పులో ముగ్గురు పుట్టినా పోటీ చేయడానికి అనర్హత వర్తించదు.