
పురుగుల మందు తాగి.. ప్రేమ జంట ఆత్మహత్య..
తల్లిదండ్రులు ప్రేమను అంగీకరించలేదని ఈ మధ్య యువతీయువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కలిసి నడవాల్సిన జీవితాన్ని అర్థాంతరంగా చనువు చాలిస్తున్నారు.
లేటెస్ట్ గా యాదాద్రి జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని రాగల రిసార్ట్స్ లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.
బీబీనగర్ ఎస్‌ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని రామంతాపూర్ కేసీఆర్ నగర్‌కు చెందిన బంధబాల సుధాకర్ (39), అదే రామంతాపూర్‌లోని గాంధీ నగర్‌కు చెందిన పాసాల సుష్మిత (35) సమీప బంధువులు.
వీరిద్దరూ వేర్వేరుగా ప్రేమవివాహాలు చేసుకుని తమ జీవితాలు గడుపుతున్నా, ఇటీవల వారు సన్నిహితంగా ఉండటం వల్ల అక్రమ సంబంధం కొనసాగుతున్నదన్న ఆరోపణలతో ఇరు కుటుంబాల మధ్య తగాదాలు చెలరేగాయి.
ఈ కారణంగా సుష్మిత భర్త ఆమెపై నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదు చేయగా, తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన సుధాకర్, సుష్మితలు రెండు రోజుల క్రితం బీబీనగర్ మండలంలోని కొండమడుగు శివారులో రాగల రిసార్ట్‌లో ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు.
ఆదివారం మధ్యాహ్నం సమయంలో సుధాకర్ తన బావ రంజిత్‌కు వీడియో కాల్ చేసి, ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నామని తెలిపాడు. అయితే, తమ స్థానం మాత్రం వెల్లడించలేదు.
దీంతో రంజిత్ తనకు సమీపంలో ఉన్న ఉప్పల్ పోలీసుల సహకారంతో బీబీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు మొబైల్ నెట్‌వర్క్ ఆధారంగా వారి గదిని గుర్తించి రూమ్ తలుపులు బద్దలుకొట్టి చూసే సరికి ఇద్దరూ అప్పటికే మృతి చెంది ఉన్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను భువనగిరి ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇద్దరూ వరుసకు బావమరదలు అవుతారని, వీరి స్వగ్రామం నల్లగొండ జిల్లా కేతేపల్లి అని పోలీసులు గుర్తించారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.




