
ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జిని ఖండించిన సీపీఎం
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: సీపీఎం డిమాండ్
ఏన్కూరులో నిరసన, ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దహనం
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జూలై 21 2026: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తూ సీపీఎం ఏన్కూరు మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఏన్కూరు ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి దొంతబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఢిల్లీలో విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేపడుతుండగా వారిపై పోలీసులు కర్కశంగా వ్యవహరించి లాఠీచార్జి చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.
ఇటీవల జరిగిన నీట్ పరీక్షల నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, గత 22 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్‌కు మద్దతుగా విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసనపై కేంద్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణి అవలంబించిందని ఆరోపించారు. విద్యార్థులపై లాఠీచార్జి చేసిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, ఎన్‌ఏటీ (NAT) సంస్థను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఇలాంటి ప్రజావ్యతిరేక, నిరంకుశ విధానాలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తే సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.




