
మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు చోరీ.. పోలీస్ వాహనం, నలుగురిని ఢీ కొట్టి..
WEB DESC : జగిత్యాల జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ చేశాడు. బస్సును అడ్డదిడ్డంగా నడుపుతూ నలుగురిని ఢీ కొట్టాడు. వెనకాల నుంచి వస్తున్న పోలీస్ కారును కూడా ఢీ కొట్టాడు. ఆ తర్వాత ఓ చోట గుంతలో బస్సు పడి ఆగిపోగా.. దిగి పారిపోతున్న నిందితుడ్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాంబయ్య అనే వ్యక్తి జూలై 21 మంగళవారం రోజున కోరుట్ల బస్ డిపోకు వచ్చి తనకు పని ఇవ్వాలని అడిగాడు. అయితే పని లేదని అక్కడి సిబ్బంది పంపించేశారు. దాంతో కోపం పెంచుకున్న సాంబయ్య అక్కడే డిపో వద్ద ఉన్న ఓ బస్సు పైకి ఎక్కి దాంతో పరార్ అయ్యాడు. డ్రైవర్, కండక్టర్ అప్పుడే బస్సు దిగారు. తాళాలు బస్సుకే ఉండటంతో ఆ బస్సుతో పరార్ అయ్యాడు సాంబయ్య. సమాచారం అందిన వెంటనే మెట్ పల్లి పోలీసులు బస్సును ఛేజింగ్ చేశారు.
అలా 10 కిలోమీటర్ల పాటు బస్సును వేగంగా నడుపుతూ పోలీస్ వాహనాన్ని, పలు వాహనాలను ఢీకొట్టాడు దుండగుడు. దాంతో పలువురికి గాయాలు అయ్యాయి. అలా నిజామాబాద్ వైపు వెళ్తుండగా హనుమాన్ దేవాలయం వద్ద గుంతలో దిగి బస్సు ఆగిపోయింది. దాంతో బస్సులోంచి దిగిన సాంబయ్య పారిపోతుండగా పోలీసులు పట్టుకుని మెట్ పల్లి స్టేషన్ కు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాను మద్యం మత్తులో ఇలా చేశానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.




