HyderabadTelangana

ప్రియురాలితో గొడవ.. ఫోన్ మాట్లాడుతూ ఆత్మహత్య

ప్రియురాలితో గొడవ.. ఫోన్ మాట్లాడుతూ ఆత్మహత్య

తాజాగా హైదరాబాద్‌లో ఓ యువకుడు తన ప్రేయసి దూరం పెడుతుందని బాధను తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే యువతితో ఫోన్లో మాట్లాడుతూనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపింది.

రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూర్‌కు చెందిన ఇమ్రోజ్‌ పటేల్ (29) కొన్ని సంవత్సరాలుగా రాజేంద్రనగర్‌లోని పరమారెడ్డిహిల్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రయివేట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే యువకుడికి ఓ యువతి పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే.. ఇటీవల కొద్ది రోజుల నుంచి ఇద్దరి మద్య గొడవలు జరగడం ప్రారంభం అయ్యింది. దాంతో.. యువతి ఇమ్రోజ్‌ను దూరం పెట్టడం ప్రారంభించింది.

ప్రేమించిన యువతి దూరం పెట్టడంతో ఇమ్రోజ్‌ మనస్తాపం చెందాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. మంగళవారం రాత్రి తాను నివసించే ఫ్లాట్‌లో ఉండి యువతికి ఫోన్ చేశాడు. కాసేపు అమ్మాయితో మాట్లాడాడు. తాను లేకుండా ఉండలేనని బతిమాలుకున్నాడు.

కానీ.. ఆ యువతి ఇద్దరికి సెట్‌ అవ్వదు వదిలేయమని చెప్పింది. యువకుడు ఇక తాను బతకలేనని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు యువతికి ఫోన్లో చెప్పాడు. ఆ తర్వాత కాల్‌ కట్‌ చేశాడు. దాంతో కంగారుపడ్డ యువతి.. ఇమ్రోజ్‌కు దగ్గరగా నివాసం ఉంటోన్న స్నేహితుడికి కాల్‌ చేసి విషయం చెప్పింది.

అతను వెళ్లి ఫ్లాట్‌ తెరిచి చూడగా ఇంట్లో అప్పటికే దుప్పటితో ఉరివేసుకుని ఇమ్రోజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button